Mudragada:టీడీపీ మాజీ ఎంపీతో ముద్రగడ భేటీ.. పొత్తుకు మద్దతు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందంజలో ఉండగా.. టీడీపీ-జనసేన కూటమి కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు వైసీపీ నుంచి నేతల చేరికలతో జోష్‌లో ఉంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు టీడీపీ, జనసేనల్లో చేరుతున్నారు. తాజాగా కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి ముద్రగడ వెళ్లారు. ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలపైనా ఇరువురి మధ్య చర్చ జరగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ- జనసేన పొత్తుకు తన మద్దతు ఉంటుందని ముద్రగడ తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు రా..కదలిరా సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ జరిగిన వెంటనే మాగంటి-ముద్రగడ సమావేశం ఆసక్తికరంగా మారింది.
కాగా ఇటీవల ముద్రగడను జనసేన నేతలు కలిసిన విషయం విధితమే. తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, సీనియర్ నేత తాతాజీలు ముద్రగడతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఆయనతో రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం జనసేనలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పవన్ కల్యాణ్‌తోనూ సమావేశం అయ్యేందుకు ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల జనసేనానితో భేటీ ఆలస్యమైందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయాలని భావిస్తున్నారు. తనతో పాటు తన కుమారుడిని కూడా పోటీలో నింపాలని యోచిస్తున్నారు. దీంతో త్వరలోనే పవన్‌తో భేటీ అయి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు జిల్లాలో ముద్రగడ మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ముద్రగడకు లేదా ఆయన కుమారుడికి పిఠాపురం ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. మరోవైపు టీడీపీ-జనసేన త్వరలోనే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై ఇరు పార్టీల అధినేతలు స్పష్టతకు వచ్చారు. ఫిబ్రవరి 8న మరోసారి భేటీ అయి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పొత్తులో భాగంగా టికెట్లు దొరకని నేతలను బుజ్జగించనున్నారు. అధికారంలోకి వస్తే పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments