Mudragada:వైసీపీలోకి ముద్రగడ.. ముహుర్తం కూడా ఖరారు..!
- IndiaGlitz, [Wednesday,March 06 2024]
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడూ ఏ నేత ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఆయన సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి.. ముద్రగడతో ఫోన్లో మాట్లాడి వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా పార్టీలో చేరమని మీరు అడుగుతున్నారా..? జగన్ అడగమన్నారా..? అని మిథున్ రెడ్డిని ముద్రగడ ప్రశ్నించారు. దీంతో సీఎం జగన్ పిలుపు మేరకే తాను అడుగుతున్నానని మిథున్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
కొద్దిరోజులుగా ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. ఆయన తొలుత వైసీపీలో చేరాలని భావించారు. కానీ సీఎం జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో జనసేన నేతలు ముద్రగడను కలిశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని వారు తెలిపారు. దీంతో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ నుంచి పిలుపురాకపోవడంతో ఆయన అలకబూనారు. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు.
ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ వేదికగా తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దని జనసేనాని స్పష్టంచేశారు. దీంతో ముద్రగడ జనసేనకు దూరం అవుతున్నట్లు మరో లేఖ పవన్‌కు రాశారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని.. ఒకవేళ ఆయన పోటీ చేయకుండా కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా వైసీపీ నేత జక్కంపూడి గణేశ్ ముద్రగడను కలిశారు. అనంతరం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫోన్లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఈనెల 12న వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా వైసీపీలో చేరేడం ఖాయమని చెబుతున్నారు. కాపు ఓట్లు పడేలా వైసీపీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తారని ముద్రగడకు హామీ ఇచ్చినట్లు కూడా వెల్లడిస్తున్నారు. మొత్తానికి కాపులు అండగా జనసేనను దెబ్బకొట్టేందుకు సీఎం జగన్ కాపు సీనియర్ నేతలకు గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరగా.. తాజాగా ముద్రగడ కూడా ఫ్యాన్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.