వరల్డ్ కప్‌లో ధోనీదే కీలక పాత్ర.. ఆయన్ను మించినోడు లేడు!

వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం సాయంత్రం మెగా టోర్నీ వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరే ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, శాస్త్రి ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ముందు శాస్త్రీ మాట్లాడుతూ.. కొద్దిలో ఆట మలుపు తిరిగే సందర్భాల్లో ధోనీ అత్యుత్తమంగా వ్యవహరిస్తాడన్నారు. ఒత్తిడి ఎదురైనప్పుడు వన్డేల్లో ధోనీని మించిన ఆటగాడెవరూ లేడంటూ మహీ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

కోహ్లి- ధోనీల మధ్య అద్భుతమైన కమ్యూనికేషన్ ఉందన్నారు. కీపింగ్ విషయంలో ధోనీకి సాటి వచ్చే ఆటగాడే లేడని మిస్టర్ కూల్‌ను శాస్త్రి ఆకాశానికెత్తేశారు. ఐపీఎల్‌లో వికెట్ల వెనుక ధోనీ చురుగ్గా స్పందించిన తీరు, హిట్టింగ్ చేసిన విధానంపై ఈ సందర్భంగా కోచ్ ప్రశంసించారు. స్థాయికి తగ్గట్టుగా ఆటతీరు కనబరిస్తే.. భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి పది ఓవర్లలో ఫ్లెక్సిబుల్‌గా ఆడటం, ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

ధోనీదే కీలక పాత్ర..!

ఈ సందర్భంగా కొహ్లీ మాట్లాడుతూ.. రాబోవు వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమన్నారు. తమదైన రోజున ఏ జట్టునైనా ప్రత్యర్థి దెబ్బతీయగలదు. ప్రతీ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందని విరాట్ చెప్పుకొచ్చారు. ఈ వరల్డ్‌కప్‌కు టీమిండియా అన్ని విధాలుగా సన్నద్ధమవుతోందన్నారు. వరల్డ్ కప్‌లో ఎంఎస్‌ ధోని కీలక పాత్ర పోషిస్తాడని విరాట్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతమున్న భారత జట్టు చాలా సమతుల్యంగా ఉందని.. మెరుగైన ప్రదర్శన చేయడమే మా ముందున్న లక్ష్యమని కొహ్లీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ తాను ఆడిన మూడు వరల్డ్ కప్‌లలో ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్ అని కోహ్లి తెలిపాడు. వరల్డ్ కప్ ప్రారంభానికల్లా కుల్దీప్ యాదవ్ గాడిలో పడతాడన్నాడు.