Mr. Majnu Review
సక్సెస్ చాలా ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో దానికి ఉన్న గుర్తింపే వేరు. మనంలో చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన అఖిల్ అక్కినేని హీరోగా అఖిల్, హలో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తను హీరోగా ఓకే అనిపించుకున్నా.. సక్సెస్‌ను మాత్రం సాధించలేకపోయాడు. అలాంటి తరుణంలో `తొలిప్రేమ`తో సక్సెస్ కొట్టిన వెంకీ అట్లూరి .. ఎ.ఎన్.ఆర్ `ప్రేమనగర్` స్టైల్ ఆఫ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ను చెప్పడంతో కనెక్ట్ అయ్యాడు. అలాగే ఎ.ఎన్.ఆర్ ఫ్యామిలీకి ఎంతగానో కలిసొచ్చిన మజ్ను అనే పేరు కలిసి వచ్చేలా మిస్టర్ మజ్ను అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని మరి ఈ సినిమాతో అఖిల్‌కు కోరుకున్న సక్సెస్ సొంతమైందా? అనేది లేనిది తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్ అక్కినేని) ప్లే బోయ్.. లండన్‌లో ఎమ్మెసీ పూర్తి చేసే పనిలో ఉంటాడు. అతనికి చదువుకంటే అమ్మాయిలను పడగొట్టడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందరి అమ్మాయిలతో జల్సా చేసే అతని గురించి తెలుసుకుని నిక్కి( నిధి అగర్వాల్) అతనంటే ఓ పాటి కోపాన్ని పెంచుకుంటుంది. నిక్కితో కలిసి ఇండియా వచ్చే క్రమంలో విక్కి ఆమెను ఫ్లర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. అయితే ఇండియాకు రాగానే అతనికొక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తన బాబాయ్ కూతురు అంటే తన చెల్లెలు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చెల్లెలే నిక్కి అని. దాంతో ఆమెను మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమెతో స్నేహంగానే ఉంటాడు. అయితే జరిగే పరిణామాల దృష్ట్యా విక్కి ప్లే బోయ్ అయినా.. మంచి వాడని, ఇతరులను గౌరవిస్తాడని తెలుసుకుని, ఫ్యామిలీకి అతనిచ్చే ప్రాముఖ్యత తెలుసుకుని అతనితో ప్రేమలో పడుతుంది. కానీ విక్కి ఆమె ప్రేమను విక్కి కాదంటాడు. అయితే ఇద్దరూ కలిసి రెండు నెలలు ప్రేమించుకుందామని.. నచ్చితేనే లైఫ్‌లోనే కంటిన్యూ అవుతామని అంటుంది. అందుకు విక్కి కూడా ఒప్పుకుంటాడు. అయితే తన పట్ల నిక్కి పొసెసివ్‌నెస్‌ను చూసి తప్పుగా అర్థం చేసుకుని ఆమె ప్రేమను కాదంటాడు. ఆమె లండన్ వెళ్లిపోయిన తర్వాత ఆమెను నిజంగానే తాను లవ్ చేస్తున్నానని తెలుసుకుని ఆమె ప్రేమ కోసం లండన్ వెళతాడు. అక్కడ నిక్కిని కలుసుకున్నాడా? తన ప్రేమను సక్సెస్ చేసుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
అఖిల్ ఎయిట్ ప్యాక్స్ లో బావున్నాడు. అప్పటిదాకా సరదాగా తిరిగిన అబ్బాయి, ఉన్నట్టుండి రిలేషన్‌షిప్ అనేసరికి సఫకేట్ అయ్యేతీరు, తన కుటుంబ సభ్యులను అర్థం చేసుకున్న తీరు, తనకు నచ్చిన అమ్మాయి కోసం ఎంతదూరమైనా వెళ్లే తీరు మెప్పిస్తుంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అఖిల్ డైలాగులు బాగా చెప్పాడు. కొన్ని చోట్ల డైలాగులు బావున్నాయి. నాన్న కోసం ఇంకు చుక్కను రాల్చలేకపోయావు.., నా చెల్లెల్ని కారు డిక్కీలో కాదు, గుండెల్లో పెట్టి చూసుకో, నేను 60 రోజులు ఊహించుకుంటే, తను జీవితాన్ని ఊహించుకుంది వంటి డైలాగులు బావున్నాయి. `ప్రేమ్‌నగర్`లోని `ఏంటో ఇంగ్లిష్.భాష.. ఎవరినైనా మిస్ చేసుకోకూడదో వాళ్లనే మిస్ అని పిలవాల్సి వస్తుంది` అనే డైలాగులు బాగా వాడుకున్నారు. రావు రమేష్ కుమారుడిగా కొత్తబ్బాయి బాగా నటించాడు. రాజా చేంబ్రోలు తన పాత్రలో చక్కగా చేశారు. సితార చెప్పే డైలాగులు, నాగబాబు నటన బావున్నాయి. సెకండాఫ్‌లో దిల్‌రాజు మనవడు ఇన్నర్ వాయిస్ బావుంది. హీరోయిన్ కజిన్ వినోద్ పాత్రలో దివంగత నిర్మాత శివప్రసాద్‌రెడ్డి తనయుడు బాబీ చక్కగా నటించారు.
మైనస్ పాయింట్లు:
సినిమాలో కొత్త పాయింట్ ఏమీ లేదు. తొలిప్రేమలో అమ్మాయి, అబ్బాయి మధ్యమానసిక సంఘర్షణ, గీతగోవిందంలో హీరోయిన్ అన్నను, హీరో చెల్లెలు చేసుకునే సీన్లు, రంగులరాట్నంలో కొన్ని సీన్లు, నాయిక చూపించే అతి ప్రేమకు సఫకేట్ అయ్యే సీన్లు రొటీన్‌గానే అనిపించాయి. దర్శకుడు చెప్పాలనుకున్న విషయం మంచిదే. కాకపోతే సీన్లే కొత్తగా లేవు. సెకండాఫ్‌లో అయితే లాజిక్కే ఉండదు. వాట్సాప్‌లో, వీడియో కాలింగ్స్ పెరుగుతున్న తరుణంలో అప్పటిదాకా తమ ఇంట్లో పెరిగిన అమ్మాయికి, ఓ అబ్బాయితో పెళ్లనుకుంటున్న విషయాన్నే ఆ కుటుంబం చేరవేయదు. అతని ఫొటోను చూపించి కనీసం సజెషన్ తీసుకోదు. ఉన్నదానికీ, లేనిదానికీ హీరోయిన్ బాబాయ్ కంటితడిపెట్టుకోవడం ఫన్నీగా అనిపిస్తుంది. హీరోయిన్ అంత బాధపడుతున్నా, ఎందుకో ప్రేక్షకుడికి ఆ ఎమోషన్ కనెక్ట్ కాదు.
విశ్లేషణ:
సినిమా రెండు భాగాలను తరచి చూస్తే కథలో మాత్రం కొత్తదనం కనపడదు. ప్రేమ కథల్లో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ఉండటం .. మధ్య బ్రేకప్ కావడం.. మళ్లీ కలుసుకోవడం అనే తరహలోనే ఉంటుంది. అయితే సన్నివేశాలను దర్శకుడు ఎంత కొత్తగా తెరకెక్కించాడనే దాన్ని బట్టి సినిమా ఆడియెన్స్ రీచ్ ఉంటుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ విషయంలో పెద్దగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే కొన్నిసన్నివేశాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. కానీ కథనంలో మాత్రం కొత్తదనం కనపడనీయలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరోను ప్లేబోయ్‌గా ఎలివేట్ చేసే తీరు.. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టించే ఎమోషనల్ సన్నివేశాలు బావున్నాయి. అయితే ఈ సన్నివేశాలను కావాలనే పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సన్నివేశాలు హీరోక్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసిన తదుపరి ఆ సీన్‌కు కనెక్టింగ్ సన్నివేశాలు కనపడవు. ఇక హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌లో హీరోయిన్, హీరో వెనుకపడటం.. అతను దాని గురించి ఇబ్బంది పడటం. తన ఇబ్బందిని స్నేహితుడికి చెబుతుంటే తెలుసుకుని ఆమె హార్ట్ బ్రేక్ కావడం ఒరకు ఓకే. కానీ సెకండాఫ్ మరీ రొటీన్ అనిపిస్తుంది. సుబ్బరాజు క్యారెక్టర్ బాలేదు. అయితే అతని కొడుకు హవభావాలను కార్టూన్ రూపంలో చెప్పిన క్రమం.. హైపర్ అది పైరసీ సీడీలను తయారు చేసే వ్యక్తిగా కనపడ్డా.. అతను సన్నివేశాల పరంగా వచ్చే కామెడీ ట్రాక్ బాగానే ఉంది. కానీ ఎక్కడా కొత్తదనం ఉండదు. చివర్లో హీరో మారిపోయి .. హీరోయిన్ ఫ్యామిలీకి విషయాలను చెప్పేసి వెళ్లిపోవడం.. హీరో కోసం హీరోయిన్ ఎయిర్‌పోర్ట్ వెళ్లడం అంత రొటీనే. అయితే చివర్లో హీరో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌ను ఫ్లర్ట్ చేస్తూ బాయ్స్ విల్ బి బాయ్స్ అనే దానికి న్యాయం చేసే సీన్‌ను ఎండ్ చేశారు. సినిమా ఆద్యంతం ఆకట్టుకోకపోయినా కొన్ని సన్నివేశాల పరంగా, కొన్ని డైలాగ్స్ పరంగా సినిమా మెప్పిస్తుంది.
బోటమ్ లైన్: కథ కొత్తదనం లేని మిస్టర్ మజ్ను
Read 'Mr Majnu' Movie Review in English
- Read in English