సంపన్న అభ్యర్థిగా వివేక్.. నిరుపేద అభ్యర్థిగా బండి సంజయ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో కీలక నేతల ఆస్తుల వివరాలపై అందరు చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి రూ.606 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలవగా.. పేద అభ్యర్థిగా బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఉన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
తనకు దాదాపు రూ.606 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. చరాస్తులు రూ.380.76 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు అని ఆయన చెప్పుకొచ్చారు. తనకు, తన భార్యకు రూ.45.44 కోట్ల ఆప్పులు ఉన్నట్లు వెల్లడించారు. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్‌గా ఆ సంస్థలో రూ.285 కోట్ల విలువచేసే షేర్లు ఉన్నట్లు చెప్పారు. 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ చూపించిన ఆస్తులతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆస్తులు 127 శాతం పెరిగాయి. అంతేకాకుండా ఏకంగా సీఎం కేసీఆర్‌కు కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా రూ.1.50కోట్లు అప్పు ఇచ్చినట్లు వివరించారు. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో వివేక్ తర్వాత స్థానంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.460కోట్లుగా ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. వార్షికాదాయం రూ.32.07 లక్షలు కాగా.. పొంగులేటి సతీమణి మాధురి ఆదాయం రూ.3.04 కోట్లుగా తెలిపారు. తర్వాతి స్థానంలో ఉన్న మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తులు రూ.458.39 కోట్లుగా ఉన్నాయి. ఆయన వార్షికాదాయం రూ.71.17 కోట్లు, భార్య లక్ష్మి వార్షికాదాయం రూ.1.27 లక్షలుగా పేర్కొన్నారు.
ఇక గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆస్తులు మాత్రం కేవలం రూ.59 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదని ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.23.50 కోట్లు, చరాస్తులు రూ.35.43 కోట్లుగా తెలిపారు. మంత్రి కేటీఆర్ తన కుటుంబానికి మొత్తం రూ.53.31 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.35.01 కోట్లు, స్థిరాస్తులు రూ.18.30 కోట్లు కాగా, రూ.11.99 కోట్ల మేర అప్పులున్నాయని వెల్లడించారు. మంత్రి హరీశ్‌రావు తన కుటుంబ ఆస్తి రూ.24.29 కోట్లుగా పేర్కొన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన కుటుంబానికి రూ.29.94 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.24.77 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద ఒక పిస్టల్, ఒక రైఫిల్ ఉన్నాయని వెల్లడించారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క కుటుంబానికి రూ.8.13 కోట్ల మేర ఆస్తులు.. హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి రూ.5.82 కోట్ల మేర ఆస్తులున్నట్లు పేర్కొ్న్నారు.
గజ్వేల్, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.50.93 కోట్ల మేర ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.. ఇందులో చరాస్తులు రూ.23.65 కోట్లు, స్థిరాస్తులు రూ.27.28 కోట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. తనకు కారు లేదని.. 13.25 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించారు. తనకు, భార్య పేరిట రెండు కార్లు ఉన్నాయని తెలిపారు. చరాస్తుల విలువ రూ.79.51 లక్షలు ఉన్నాయని.. కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. దీంతో అభ్యర్థుల అందరిలో సంజయ్‌నే అత్యంత నిరుపేద అభ్యర్థిగా నిలిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com