MP Rammohan Naidu:విజయ్ దేవరకొండ సహాయం.. ఎంపీ రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు..

  • IndiaGlitz, [Friday,November 03 2023]

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన సినిమాల నుంచి వచ్చిన సంపాదనతో పేదలకు సహాయం చేస్తూ ప్రజల్లో మంచిపేరు సంపాదించుకుంటున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ఖుషి(Kushi) సినిమా మంచి విజయం సాధించడంతో తన రెమ్యూనిరేషన్‌లోని కోటి రూపాయలను వంద పేద కుటుంబాలకు ఇస్తానని తెలిపారు. అందుకే తగ్గట్లే ఖుషి సినిమా సక్సెస్ మీట్‌లో వారికి ఈ డబ్బును అందేలా చేశారు.

ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి మండలం కురుడు గ్రామంలో షర్మిల శ్రీ అనే పాప ఇటీవల ఓ ప్రమాదంలో కాలు కోల్పోయింది. ఆ కుటుంబం కష్టాల్లో ఉందని తన అభిమానుల ద్వారా తెలుసుకున్న విజయ్‌.. ఆ కుటుంబానికి అండగా నిలబడుతూ లక్ష రూపాయలు చెక్ ఇచ్చారు. దీంతో విజయ్ అభిమానులు లక్ష రూపాయల చెక్కుని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు(RamMohan Naidu) చేతుల మీదుగా ఆ పాపకి అందించారు. దీంతో ఆ కుటుంబం విజయ్ దేవరకొండకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దైవం మనుష్య రూపేణ అనే వాఖ్యానికి అర్ధంగా నిలుస్తూ నటుడు విజయ్ దేవరకొండ చేసిన సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి తాను కూడా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ డబ్బులు అందేలా చేసిన శ్రీకాకుళం విజయ్ దేవరకొండ అభిమానులను అభినందించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విజయ్ గొప్ప మనసును అభినందిస్తున్నారు.