Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని, ఆయన కుమార్తె సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. ఎంతమంది చెప్పినా పార్టీలోనే కొనసాగానని చెప్పుకొచ్చారు. దాదాపు రూ.2వేల కోట్లు పార్టీ కోసం అమ్ముకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపిటీసీ, కార్పోరేషన్, జనరల్ ఎలక్షన్‌ల ఖర్చులు తానే భరించానని.. అయినా అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని వాపోయారు.
గతంలో ఓ వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి తనను ఉద్దేశపూర్వకంగానే తిట్టించారంటూ మండిపడ్డారు. చెప్పుతో తనను కొడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ నుంచి కనీసం స్పందన లేదన్నారు. ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లో నెగ్గని నారా లోకేశ్‌కు గులాంగిరీ చేయాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేస్తే తాను ఎందుకు పాల్గొనాలని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారని విమర్శించారు. తన సోదరుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలనుకంటే రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం పోటీ చేసే వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నరసరావుపేట స్థానాలు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. కేవలం తన కుటుంబంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే తన సోదరుడిని తన పైకి పురికొల్పారని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ జిల్లాలో 60శాతం టీడీపీ ఖాళీ అయిపోతుందని.. తనతో పాటు చాలా మంది పార్టీని వీడటం ఖాయమని వివరించారు. ఎంపీగా పోటీ చేయమంటారా? పార్టీ చుసుకోమంటారా? ఖాళీగా ఉండమంటారా అనేది జగన్ ఇష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి కనీసం 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని.. ఆమోదం పొందగానే వైసీపీలో చేరతానని కేశినాని స్పష్టంచేశారు. మొత్తానికి కేశినేని వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీకి కంచుకోట అయిన విజయవాడ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments