అవార్డు తీసుకున్న తర్వాత ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Friday,February 01 2019]
టీఆర్ఎస్ ఎంపీ కవిత ‘ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్’ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఒకింత ఆవేదన.. మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజల దీవెనెలతో ఈ అవార్డు వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ అవార్డుతో మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవ చేస్తానన్నారు.
ఈవీలం గురించి మాట్లాడుతూ..!
తెలంగాణలో గల్లీ లీడర్ మొదలుకుని ఢిల్లీ లీడర్ వరకు ఈవీఎంలలో ఏదో జరిగిందని హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతే ధీటుగా టీఆర్ఎస్ నేతలు సైతం ఆ విమర్శలను తిప్పి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా.. కవిత మాట్లాడుతూ.. ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంపై మాట్లాడడం సరికాదని హితవు పలికారు. 130 కోట్ల ప్రజలున్న దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం.. ఇప్పటికే ఈవీఎం ట్యాప్ చేశారంటూ దేశ వ్యాప్తంగా ప్రజల్లో అపనమ్మకం కల్పిస్తున్నారని ప్రతిపక్షాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్లో సైతం ఈవీఎంలపై ప్రెస్మీట్ పెట్టి ఇండియా పరువు తీయొద్ధని ఈ సందర్భంగా కవిత కోరారు.
తెలంగాణకే కేంద్రం చేసిందేమీ లేదు..
రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం తాము చేసిన చిన్న చిన్న పనులను పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేసింది. గంటన్నర రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపై ఊసే లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏ పథకం గురించి చెప్పుకునే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైంది. జీఎస్టీ, నోట్ల రద్దు ఫలితాలపై చర్చనే లేదు. 5 పరిపూర్ణ బడ్జెట్లు పెట్టిన కేంద్రం, ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో ఏదో సాధిస్తామని చెబుతోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా, ఎన్నికల వరాలు కురిపించేలా కొత్తగా కేంద్ర పూర్త స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5 బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ మాత్రం పెద్ద పీఠ వేయలేదు ఢిల్లీ వేదికగా కవిత చెప్పుకచ్చారు.
25వేల కోట్లు ఇవ్వండి!
తెలంగాణకు ఆదాయ పన్నుతో వచ్చే నిధులే తప్ప, ఏ పథకానికి ఒక్క రూపాయి కేంద్రం మంజూరు చేయలేదు . పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే, కాళేశ్వరానికి జాతీయ హోదా, నీతి ఆయోగ్ సూచించినట్లు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు 25 వేల కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 2014 లో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. కేవలం ఎన్నికలకు రెండు నెలలే ఉన్న తరుణంలో కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ అంటే అది ప్రజల్ని మభ్యపెట్టడమే.. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిసి గట్టుగా చూసే ప్రయత్నం కేంద్రం చేయడం లేదు అని కవిత చెప్పుకొచ్చారు.
మొదట్నుంచి టీఆర్ఎస్ నేతలకు బీజేపీ అంటే పడనట్లుగానే ఉన్న గులాబీ దళం ఈ సారి ఏకంగా అవార్డు అందుకుని మరీ అందరి ముందూ కవిత ఇలా మాట్లాడటం గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై కమలనాథుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.