పసిపాప ప్రాణం కోసం ఫ్లైట్‌లో తల్లిపాలు.. అసలు కథేంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
కనీసం నెల రోజులు కూడా నిండని పసికందు ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం పాప తల్లిదండ్రులే కాదు.. పసికందు ముక్కూ మొహం తెలియని వ్యక్తులు సైతం తాపత్రయ పడుతున్నారు. ఆ పసికందుకు సంబంధించిన ఓ విషయం తెలిస్తే.. ఆశ్చర్యం వేయక మానదు. పసికందు కోసం తల్లిపాలు.. 1000 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నాయి. అది కూడా ఫ్లైట్‌లో.. పాల కోసం రోజూ ఆ తండ్రి పొద్దున లేవగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆ తండ్రి పేరు... జిక్‌మెత్ వాంగ్డూ.
అసలు విషయం ఏంటంటే..
జిక్‌మెత్ వాంగ్డూ దంపతులది లడఖ్‌లోని లేహ్. ఇటీవలే జిక్‌మెత్ భార్యకు సిజేరియన్ ద్వారా పాప జన్మించింది. అయితే పాపకు పుట్టుకతోనే ఆహార నాళం, శ్వాసనాళం కలిసిపోయాయి. లేహ్ వైద్యులు పాపకు ప్రత్యేక సర్జరీ అవసరమని తెలిపారు. దీంతో తల్లి పొత్తిళ్లలోని పసిదానితో జిక్‌మెత్ ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లికి సర్జరీ అయి ఉండటంతో ఆమె రాలేని పరిస్థితి. శస్త్ర చికిత్సకు అంతా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పసిదానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. అందుకు తల్లి పాలు కావాలి. కానీ తల్లి రాలేని పరిస్థితి.
లేహ్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌లో తల్లిపాలు..
పాపకు పాలు అందించేందుకు ఒకరిద్దరు కాదు.. ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ముక్కూ, మొహం తెలియని ప్రయాణికులు సైతం సాయపడుతున్నారు. కన్నకూతురి కోసం జిక్‌మెత్ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న తన స్నేహితుడిని సంప్రదించారు. పాప పరిస్థితిని వివరించి.. తల్లిపాలను ఢిల్లీకి చేరవేసేందుకు సాయం చేయమని కోరారు. దీంతో సహృదయంతో స్పందించిన సదరు స్నేహితుడు ఎయిర్‌పోర్టులోని మరికొందరి సాయంతో ప్రతిరోజూ తల్లిపాలను లేహ్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. ప్రతిరోజూ తల్లి ఉదయాన్నే తన పాలను లేహ్ ఎయిర్‌పోర్టుకు చేరవేస్తుంది. అక్కడ నుంచి విమాన సిబ్బంది ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తరలిస్తారు. అక్కడి ప్రయాణికుల సాయంతో తండ్రికి ఆ పాలను చేరవేస్తున్నారు. పాప మరో వారంలో కోలుకుంటుందని.. ఆ వెంటనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout