ముగ్గురు పసివాళ్లకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యాయత్నం
Send us your feedback to audioarticles@vaarta.com
అభం శుభం.. పాపం పుణ్యం తెలియని చిన్నారులు.. అమ్మ ఏదిచ్చినా అమృతంలా భావించి తాగేస్తారు.. ఈ క్రమంలోనే అమ్మ విషం ఇచ్చినా కళ్లు మూసుకుని తాగేశారు.. అంతే ఆ కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ముగ్గురు పసివాళ్లకూ విషమిచ్చిన అనంతరం తాను విషం తాగింది. అయితే ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లె గ్రామంలో జరిగింది. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.
అసలు విషయంలోకి వెళితే.. మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన సుబ్బనరసమ్మ, నిత్యపూజయ్య దంపతులకు సుబ్బరాయుడు (3), సుబ్బరత్న (2), బాబు (రెండు నెలలు) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిత్యపూజయ్య పొలం పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వచ్చిన కూలి డబ్బులతో నిత్యం మద్యం సేవిస్తుండటంతో కనీసం కుటుంబం గడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద మనుషులు సర్దుబాటు చేసేవారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆ మనస్పర్థలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్యతో గొడవపడి భర్త పొలం పనికి వెళ్లిపోయాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న సుబ్బనరసమ్మ ఏం ఆలోచించిందో ఏమో కానీ తన ముగ్గురు పిల్లలకూ పురుగుల మందు తాగించి తనూ తాగేసింది. నలుగురూ ఎంతకీ ఇంటిలో నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో పిల్లల నానమ్మ అయ్యవారమ్మ ఇంటి తలుపు తీసి చూసింది. నలుగురు నేలపై పడిపోయి ఉండటాన్ని గమనించి భయంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి... ఆ నలుగురినీ రిమ్స్‌కు తరలించారు. కొద్దిసేపటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందగా... సుబ్బనరసమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కడప డీఎస్పీ బూడిద సునీల్, రిమ్స్ సీఐ పి.సత్యబాబు, పెండ్లిమర్రి ఎస్ఐ ఆర్వీ కొండారెడ్డి విచారణ నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments