మూఢనమ్మకంతో నెలల చిన్నారి గొంతుకోసి హతమార్చిన తల్లి
Send us your feedback to audioarticles@vaarta.com
మూఢ నమ్మకాల మత్తులో మరీ బాగా చదువుకున్న వారే పడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మదనపల్లి ఘటన మరువకముందే.. మరో తల్లి తన ఆరు నెలల చిన్నారిని పూజల పేరుతో గొంతు కోసి దారుణంగా హతమార్చింది. ఇంతటి దారుణానికి పాల్పడిన మహిళ నిరక్షరాస్యులేమీ కాదు.. బీఎస్సీ బీఈడీ చదివి.. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సైతం సన్నద్ధమైంది. అంత చదువుకున్న మహిళ మూఢ నమ్మకంతో కన్నబిడ్డనే కడతేర్చింది.
సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన భారతి అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం పుట్టింటికి వచ్చేసిన భారతి అదే తండాకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసి మరీ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. వీరికి ఆరు నెలల కిందట పాప పుట్టింది. కాగా.. భారతికి స్వతహాగానే దైవభక్తి చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే ఆమె రోజూ యూట్యూబ్‌లో రకరకాల ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ తనను తాను శివుడిగా భావిస్తూ ఉండేది.
అయితే ఇటీవల తండాకు వచ్చిన ఓ సాధువు.. భారతికి నాగదోషం ఉందని చెప్పాడు. దీంతో ఆమె మానసిక పరిస్థితి దారుణంగా తయారైంది. నిత్యం పూజలతోనే గడిపేది. గురువారం భర్త కృష్ణ, అత్తమామలు ఇంట్లో లేని సమయంలో భారతి తన కూతురు రీతును దేవుడి ఫోటోల ముందు పడుకోబెట్టి గొంతు కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమై పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.పాప మరణించిన భారతి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆమె తల్లి బూబ.. పాప గురించి ప్రశ్నించడంతో సరిగా సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన బూబా.. వెంటనే భారతి ఇంటికెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పసిదాని శవం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com