హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా
- IndiaGlitz, [Tuesday,April 21 2020]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో నగరవాసుల్లో భయం, ఆందోళన ఎక్కువైంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ లిమిట్స్‌లో ఇప్పటి వరకు 399 కేసులు నమోదవ్వడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 08 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనర్ లిమిట్స్‌లో 51 మంది మాత్రమే కోలుకున్నారు. కరోనా మరణాల్లో 20 మంది హైదరాబాద్ లిమిట్స్‌వారే కావడం షాకింగ్‌కి గురి చేస్తోంది.
జోన్‌ల వారిగా పరిస్థితి ఇదీ..
తాజాగా.. హైదరాబాద్ పోలీస్ లిమిట్స్‌లో జోన్లు వారిగా కరోనా కేసుల లిస్ట్‌ను నగర సీపీ అంజనీకుమార్ జాబితాను విడుదల చేసింది. వెస్ట్, సౌత్ జోన్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నదని జాబితాను బట్టి తెలుస్తోంది. వెస్ట్ జోన్-138, సౌత్ జోన్-170 కేసులు, సెంట్రల్ జోన్-45, ఈస్ట్ జోన్-33 కేసులు కేసులు నమోదయ్యాయి. నార్త్ జోన్‌లో కరోనా ఇప్పటి వరకూ 13 కేసులతో తక్కువ తీవ్రతే ఉంది. కాగా.. నగరంలో ఎక్కువగా కేసులు ఉండటంతో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 873. ఇప్పటివరకూ రాష్ట్రంలో 21 మంది మరణించారు.