ఢీ, రెడీ, దేనికైనా రెడీ వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్‌బాబు వారసుడు విష్ణు మంచు కథా నాయకుడిగా నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. అమెరికాలో ఇద్దరు భారతీయులైన అక్కా తమ్ముడు కలిసి చేసిన అతి పెద్ద స్కామ్‌ను ఆధారం చేసుకుని ‘మోసగాళ్లు’ సినిమాను ఇంగ్లీష్‌లో నిర్మించాలని విష్ణు మంచు అనుకున్నాడు. అయితే బడ్జెట్ పరిమితులు దాటడంతో తెలుగులోనూ నిర్మించి, దాన్ని ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయాలనుకున్నాడు. అలా ‘మోసగాళ్లు’ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో కాజల్ అగర్వాల్.. విష్ణు మంచు అక్క పాత్రలో నటించడం. ఇంతకీ విష్ణు మంచు చేసిన ఈ ప్రయత్నం తనకు ఎలాంటి సక్సెస్‌ను అందించిందనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
అను(కాజల్ అగర్వాల్), అర్జున్ వర్మ(విష్ణు మంచు) ఓ బస్తీలో పుట్టిన కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి నాన్న నిజాయతీ ఇతర కారణాలతో కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. దాంతో వారిలో ఓ తెలియని కసి పెరుగుతుంది. దాంతో వాళ్లు ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుంటారు. అందుకోసం మోసాలు చేయడానికి సిద్ధపడతారు. అదే సమయంలో వీరికి ఓ స్నేహితుడు విజయ్(నవదీప్) పరిచయం అవుతాడు. అతని సాయంతో ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అమెరికన్ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్టెమెంట్ పేరుతో అక్కడి ప్రజలకు ఫోన్ చేసి ట్యాక్స్ కట్టమని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. అలా వారు రు.2600 కోట్లను ప్రజల నుంచి కొల్లగొడతారు. లైఫ్‌లో సెటిలైపోతామని అను చెప్పినా, తర్వాత అర్జున్ వినిపించుకోడు. డబ్బుందనే పొగరుతో సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాడు. అను, అర్జున్ చేసిన పని వల్ల అమెరికాలో చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ విషయం తెలిసిన ఓ ఉద్యోగిని అమెరికన్ అథారిటీస్‌కి ఫోన్ చేస్తుంది. వాళ్లు భారత ప్రభుత్వంతో చేతులు కలిపి ఇండియాకు చెందిన ఏసీపీ(సునీల్ శెట్టి) సాయంతో అర్జున్‌ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు అను ఏం చేస్తుంది? అర్జున్ జైలు నుంచి బయటపడ్డాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అమెరికాలో ఇద్దరు భారతీయులు చేసిన అతి పెద్ద స్కామ్‌ను సినిమా రూపంలో చేయాలనుకోవడం విష్ణు మంచు తీసుకున్న ఓ డేర్ స్టెప్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడకు వెళ్లి విషయ సంగ్రహణ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. తర్వాత సినిమాటిక్ ఫార్మేట్‌లోకి తీసుకొచ్చి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమా రూపంలోకి మార్చాలి. అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. దర్శకుడు సినిమాను గ్రిప్పింగ్‌గా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా టేకాఫ్ బాగానే ఉంటుంది. హీరో, హీరోయిన్ గతం చకచకా పూర్తి చేసేసి వెంటనే సినిమాలోకి తీసుకెళ్లిపోయాడు. కాల్ సెంటర్‌లో ఎలా డేటాను సేకరిస్తారు.. ఎలా కాల్ చేసి మోసం చేస్తారు అనే అంశాలను త్వరగా ఆవిష్కరించాడు. సామ్ సి.ఎస్ బీజీఎం సన్నివేశాలకు బలాన్నిచ్చింది. అలాగే షెల్డన్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అయితే దర్శకుడు కొన్ని సన్నివేశాలను ఇండియాలోనే చిత్రీకరించి అమెరికాలో అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అలాగే టెక్నికల్‌గా మోసాలు ఎలా చేయవచ్చుననే దాన్ని విశీదీకరంగా చూపిస్తే అది ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. కానీ దర్శకుడు అండ్ టీమ్ ఈ విషయాలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే చెప్పాలి.
విష్ణు మంచు కథలో అర్జున్ వర్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. మోసం చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి ఉన్నట్లు చేసే బిహేవియర్‌ను చక్కగా ఆవిష్కరించాడు విష్ణు. ఇక కాజల్ అగర్వాల్ పాత్ర పరంగా చేయాల్సినంత బెటర్‌మెంట్ ఇచ్చింది. కానీ.. ఇంకా బెస్ట్‌గా చూపించి ఉండొచ్చుననే భావన కలుగుతుంది. సునీల్ శెట్టి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించినా, ఫస్టాఫ్‌లో ఈ పాత్రకు పెద్దగా స్కోప్ కనిపించదు. సునీల్ శెట్టి, నవీన్ చంద్రల మధ్య దొంగా పోలీస్ ఆట ... కథకు బ్రేకుల్లా అనిపిస్తాయి. నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇలాంటి కథలకు ఆసక్తికరమైన మలుపులు ఎంతో అవసరం. అలాంటి ఎగ్జయిటింగ్ ట్విస్టులు పెద్దగా కనిపించలేదు.
బోటమ్ లైన్: ఎగ్జయిటింగ్ మిస్ చేసిన మోసగాళ్లు
Comments