వ‌సూల్ కంటే మాకు మ‌రింత రెస్పెక్ట్ తెచ్చిన సినిమా నాన్న‌కు ప్రేమ‌తో : ఎన్టీఆర్

  • IndiaGlitz, [Friday,January 22 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌ని తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో..ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా రిలీజైన నాన్న‌కు ప్రేమ‌తో...విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఫ‌స్ట్ వీక్ లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నాన్న‌కు ప్రేమ‌తో...నిల‌వ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ...ఈ సినిమాలో ఆర్టిస్ట్ లు క‌న్నా...హార్టిస్ట్ లు ఉన్నారు. మంచిని కోరుకునే హార్టిస్ట్ లు చేసిన సినిమా కాబ‌ట్టే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. మేం 50% ఎమోష‌న్ చేస్తే 100% ఎమోష‌న్ ఫీల్ క‌ల‌గ‌డానికి కార‌ణం దేవిశ్రీప్ర‌సాద్ అందించిన సంగీతం. ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 25వ సినిమా నాన్న‌కు ప్రేమ‌తో లో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ...మంచి సినిమాకి కొల‌మానం ఏమిటంటే.. మ‌న భాష తెలియ‌ని వాళ్లు మ‌న సినిమా చూసి బాగుంద‌ని చెప్పడం. అలా ఈ సినిమాకి జ‌రిగింది. ఇంత మంచి సినిమాలో ఓ మంచి పాత్ర ఇచ్చిన సుకుమార్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ని చాలా ద‌గ్గ‌ర‌గా చూసాను. చిన్న‌ప్ప‌టి నుంచి అభిమానించిన జ‌గ‌ప‌తిబాబు గారు, రాజేంద్ర‌ప్ర‌సాద్ గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

రాజేంద్ర‌ప్రసాద్ మాట్లాడుతూ...ఒక్క సినిమా స‌క్సెస్ అయితే హ‌మ్మ‌య్యా అనుకునే ఈరోజుల్లో ఈ సినిమా స‌క్సెస్ అవ్వ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఫ‌స్ట్ డే టాక్ కి ఈరోజు క‌లెక్ష‌న్స్ కి సంబంధం లేదు. నిజ‌మైన విజ‌యాన్ని ఎవ‌రు ఆప‌లేరు. నాన్న‌కు ప్రేమ‌తో...హిట్ అయ్యిందంటే ఆ క్రెడిట్ ప్రేక్ష‌కుల‌దే. మ‌రీ ముఖ్యంగా యంగ్ జ‌న‌రేష‌న్ కి ఈ సినిమా న‌చ్చ‌డం ఆశ్చ‌ర్యం. ఈ సినిమా చూసిన త‌ర్వాత తండ్రి - కొడుకుల మ‌ధ్య అనుబంధం మ‌రింత పెరుగుతుందంటే దానికి కార‌ణం సుకుమార్. ఈ సినిమాలో నేను 100% ఎమోష‌నల్ గా న‌టించానంటే దానికి కార‌ణం ఎన్టీఆర్. అలాగే జ‌గ‌ప‌తిబాబుతో వ‌ర్క్ చేయ‌డం థ్రిల్ క‌లిగించింది. హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా బాగా న‌టించింది. ఈ సినిమాని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...ఎన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ చాలా త‌క్కువ సినిమాల్లోనే సంతృప్తి ల‌భిస్తుంది. అలా సంతృప్తి క‌లిగించిన చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ సినిమాలో బాగా న‌టించావ్ అని అలాగే ఫ‌స్ట్ టైం చెప్పిన‌ప్ప‌టికీ డ‌బ్బింగ్ బాగా చెప్పావ్ అని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నారు.

జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ...ఈ సినిమాలో హైలెట్ ఏమిటంటే...హీరో - విల‌న్ రొమాన్స్. ఆ సీన్ చేసేట‌ప్పుడు సుకుమార్ అదిరిపోవాల‌ని చెప్పారు. అలాగే ఆ సీన్ అదిరిపోయింది. ఈ సినిమాని బి,సి సెంట‌ర్స్ లో చూడ‌రు అన్నారు కానీ అన్ని సెంట‌ర్స్ లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది అన్నారు.

డైరెక్ట‌ర్ సుకుమార్ మాట్లాడుతూ... స‌క్సెస్ రావ‌డంతో ఆనందంతో అల‌సిపోయాం. మాట‌ల‌డ‌డానికి మాట‌లు మిగ‌ల్లేవు. మా సినిమా నాన్న‌కు ప్రేమ‌తో..కి మంచి విజ‌యాన్నిఅందించిన అంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ...నా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన సుకుమార్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూసుకుంటే నాన్న‌కు ప్రేమ‌తో..అనే మంచి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని వ్యాపారంతో కాకుండా సినిమా పై వ్యామోహంతో తీసిన నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ గార్కి థ్యాంక్స్. మా ప్ర‌య‌త్నానికి ప్రాణం పోషింది దేవిశ్రీ. అలాగే మా అంద‌రితో స‌మాన‌మైన పాత్ర‌ను ర‌కుల్ అద్భుతంగా చేసింది. ఈ సినిమాకి నేను చిన్న‌పిల్లాడిని. జ‌గ‌ప‌తిబాబు గారు, రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు, నిర్మాత ప్ర‌సాద్ గారు, సుకుమార్ ఈ నలుగురు పిల్ల‌ర్స్. రాజీవ్ తో క‌ల‌సి న‌టించి చాలా రోజులు అయ్యింది. మంచి పాత్ర వ‌చ్చిన‌ప్పుడు రాజీవ్ చేయాల‌నుకుంటాను. వెర్స‌టైల్ ఆర్టిస్ట్ రాజీవ్. అలాగే అవ‌స‌రాల శ్రీనివాస్ కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో అవ‌స‌రాల శ్రీనివాస్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్ప‌లేను కానీ మ‌న‌కి భ‌యంక‌ర‌మైన రెస్పెక్ట్ వ‌స్తుంద‌ని చెప్పాడు. అలాగే జ‌రిగింది. ఈ సినిమా వ‌సూల్ కంటే మాకు మ‌రింత‌ రెస్పెక్ట్ తీసుకువ‌చ్చింది. మేం చేసిన ప్ర‌య‌త్నాని అభినందించి ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.