కిమ్‌తో నాలుగోసారి చర్చకు సిద్ధమైన మూన్‌ జే

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య ఇప్పటికే చర్చలు జరిగిన విషయం విదితమే. అయితే చర్చలు విఫలం కావడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో నాలుగోసారి సమావేశం కావడానికి మేం సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ప్రకటించారు. కాగా.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ మధ్య ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయిన విషయం విదితమే. ఇదిలా ఉంటే.. తాను మూడోసారి.. అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కిమ్‌ ఇటీవల ప్రకటించారు.

ఉత్తరకొరియా ఎప్పుడు సిద్ధంగా ఉన్నా సరే.. మా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని మూన్ స్పష్టం చేశారు. కీలక, ఆచరణాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నామని.. ఉత్తరకొరియా, అమెరికా మధ్య రెండు సదస్సులు జరిగాయన్నారు. ఈ విషయంలో మరింత పురోగతి సాధించే క్రమంలో ఉత్తరకొరియాతో మరోసారి సదస్సులో పాల్గొనాలని భావిస్తున్నామని దక్షిణ కొరియా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఉత్తరకొరియాకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు సమాచారం.