ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో కరోనాకు తొలిసారిగా మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్‌లో కరోనా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ ప్రయోగం నిర్వహించారు. సెలైన్ ద్వారా అర్ధగంట వ్యవధిలో బాధితుడికి కాక్‌టెయిల్ ఇంజక్షన్‌ను వైద్యులు ఇచ్చారు. అరగంటలో కరోనా బాధితుడిని ఆయుష్ వైద్యులు ఇంటికి పంపించేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ యాంటిబాడీ మందు ల్యాబ్‌లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్‌ల సమ్మెళనం. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్‌ని నిరోధించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది.
ఇదీ చదవండి: 2-డీజీ ఔషధం ధర ఫిక్స్..
మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా ఈ ఇంజక్షన్ అడ్డుకుంటుంది. అయితే ఈ ఇంజక్షన్‌ను ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.గత ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే చికిత్సతో కోలుకున్నారు. మైల్డ్, మోడరేట్ బాధితుల పాలిట ఈ చికిత్స బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను కాక్‌టైల్‌గా ఇంజక్ట్ చేస్తారు. ఒకటి గురితప్పినా.. మరో రకం యాంటీబాడీలు వైరస్‌ను అడ్డుకుంటాయి. ఈ ఇంజక్షన్ రెట్టింపు భద్రతను కల్పిస్తుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజక్షన్ ఒక్కోడోసుకు రూ. 70 వేల వరకు ఖర్చవుతుంది. మైల్డ్, మోడరేట్ బాధితులకు సింగల్ డోస్ సరిపోతుంది.
ఇంజక్షన్ ఇచ్చిన గంట పాటు రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. కొన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా ఈ చికిత్స బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్స తర్వాత మూడు నెలలకు వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా చికిత్స ద్వారా మరణాలను 70 శాతం వరకు తగ్గించారు. ఇందులో వైరస్ తీవ్రత, రోగి ఎంపిక, సమయం చాలా ముఖ్యమైనవి. ఈ ఇంజక్షన్‌ను 65 ఏళ్లు దాటిన వారు, స్థూలకాయులు, నియంత్రణలేని మధుమేహులు, గుండె జబ్బు బాధితులు, కేన్సర్ బాధితులు, రోగనిరోధక ఔషధాలు వాడుతున్న వారికి మాత్రమే ఇవ్వాలి. 55 ఏళ్లు నిండిన వారిలో.. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇవ్వొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments