ఎప్పుడో బాలనటిగా సినీ తెరంగేట్రం చేసిన శ్రీదేవి స్టార్‌హీరోలందరితో ఆడిపాడింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా నెంబర్‌వన్ హీరోయిన్‌గా రాణించింది. నిర్మాత బోనికపూర్‌ను పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి మధ్యలో పులి అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే వరుస సినిమాలు చేయకుండా నచ్చిన కథలనే చేయడానికి నిర్ణయం తీసుకున్న శ్రీదేవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'మామ్' ఆసక్తికరమైన విషయమేమంటే, ఈ ఏడాది నటిగా శ్రీదేవి 50 వసంతాలను పూర్తి చేసుకోవడమే కాదు, మూడు వందల సినిమాల మైలురాయిని చేరుకుంది. ఇన్ని విశిష్టతలున్న 'మామ్' సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటి చూద్దాం...
కథ:
ఆనంద్ సబర్వాల్(అద్‌నాన్ సిద్ధిఖీ)ని ఇష్టపడ్డ దేవకి(శ్రీదేవి), ఆనంద్‌కు ఆర్య(సజల్ అలీ) కూతురు ఉన్నా పెళ్ళి చేసుకుంటుంది. ఆర్యకు, దేవకి అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు తన అసంతృప్తిని బయట పెడుతుంటుంది కూడా. కానీ దేవకి వాటన్నింటిని సర్దుకుంటూ ఉంటుంది. ఓసారి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్ళిన ఆర్యను ఓ నలుగురు వ్యక్తులు రేప్ చేస్తారు. అందులో ఆర్య క్లాస్‌మేట్ మోహిత్ కూడా ఉంటాడు. చావు బ్రతులకు మధ్య ఉన్న ఆర్య ఇచ్చిన స్టేట్‌మెంట్, పోలీసుల ఆధారాలు కోర్టులో చెల్లవు. దీంతో కోర్టు నేరం చేసిన నలుగురిని నిర్దోషులుగా విడిచి పెడుతుంది. ఆర్య మానసిక పరిస్థితి కూడా పాడవుతుంది. అలాంటి సమయంలో దేవకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై దేవకి కోరుకునే న్యాయం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
పాత్రధారులు:
యాబై ఏళ్ళ అనుభవమున్న నటి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్‌లో శ్రీదేవి నటన పీక్స్‌లో ఉంది. అలాగే తనకు జరిగిన అన్యాయంపై చేసే ప్రతి దాడిలో కూడా బేలెన్స్‌డ్‌గా నటించింది. ఎమోషనల్‌సీన్స్‌లో శ్రీదేవి నటన చూస్తే, ఆమె తప్ప మామ్ పాత్రలో మరెవరూ సూట్ కారేమో అనిపిస్తుంది. పాకిస్థానీ నటి సజల్ అలీ కూడా కూతురు పాత్రలో చక్కగా నటించింది. ఇక అద్‌నాన్ సిద్ధిఖీ, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అభిమన్యుసింగ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాంయ చేశారు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల పనితీరు అద్భుతంగా ఉంది. సన్నివేశాల్లో శ్రీదేవి సహా అందరూ ఒదిగిపోయి నటించారు. ఇక అనే గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రతి సీన్ చాలా క్లారిటీతో ఉంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎ.ఆర్.రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. రెహమాన్ తన బీజీఎంతో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ ఓకే.
మైనస్ పాయింట్స్:
పాటలకు పెద్దగా స్కోప్ లేవు. ఉన్నవి కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఇక సెకండాఫ్‌లో స్లో అయ్యింది. ఎడిటర్ సెకండాఫ్ విషయంలో కాస్తా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. కథ పరంగా కొత్తగా చెప్పిందేమీ లేదు. నిర్భయ కేసులోజరిగిన విషయాలతో పాటు ప్రధాన మెట్రో నగరాల్లో మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే విషయాలను చూపించారు.
ఫైనల్‌గా...
కూతురుకి అన్యాయం జరిగితే, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే సినిమాలో ప్రధాన పాత్రధారి ఏం చేశాడనే విషయాలను సర్పయాగం, దృశ్యం వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు చూసేశారు. కాబట్టి కథ పరంగా ఎక్కడా కొత్తదనం కనపడదు. సినిమా ముందు అర్ధగంట కాగానే అసలు కథ ఎలా ఉండబోతుందనే ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. అయితే ఎమోషనల్ కంటెంట్ సినిమాలో బలంగా ఉంది. కూతురి కోసం తపన పడే తల్లి, చివరకు తల్లి ప్రేమను అర్థం చేసుకునే కూతురు ఇలాంటి విషయాలు మెప్పిస్తాయి. అయితే ఓ వర్గం ప్రేక్షకులకే ఇలాంటి సినిమాలు నచ్చుతాయి. యూత్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఈ సినిమాలు పెద్దగా నచ్చవు. అయితే దర్శకుడు రవి మాత్రం ఓ ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఆ అమ్మాయితో పాటు ఆమె కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్న సమాజం నుండి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనే విషయాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఏదో రివేంజ్ మూవీ తరహాలో కాకుండా అసలు మన చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలనే తీరులో సినమా అంతా రన్ అవుతుంది. ఇలాంటి ఎమోషన్స్ ప్రతి సీన్‌లో క్యారీ అయ్యాయి. కథకు తగ్గనటీనటులు కూడా ప్లస్ అయ్యారు మరి.
బోటమ్ లైన్: మనసు తలుపు తట్టే 'మామ్'
Comments