విఘ్నాలు దాటుకుని.. ఫిబ్రవరి 18ని లాక్ చేసిన ‘'సన్ ఆఫ్ ఇండియా'

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. అడపా దడపా గెస్ట్ రోల్స్ చేయడమే తప్పించి.. లీడ్ రోల్‌లో ఆయన హీరోగా నటించి చాలాకాలం అవుతోంది. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘‘సన్ ఆఫ్ ఇండియా’’. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 18న సన్ ఆఫ్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ‘దేశభక్తి అతని రక్తంలోనే ఉంది’ అంటూ ట్విట్టర్‌లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ . మోహన్ బాబును వెండితెరపై చూసుకుని మూడేళ్లు గడుస్తోంది. సూర్య హీరోగా నటించిన ‘‘ఆకాశం నీ హద్దురా’’లో ఆయన చివరిసారి కనిపించారు.

డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆల్‌మోస్ట్ షూటింగ్ పూర్తి కావొస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించినట్లుగా పోస్టర్లు, గ్లింప్స్ చెబుతున్నాయి. ఆయన కోడలు, విష్ణు సతీమణి విరోనిక ఈ సినిమాలో మోహన్‌బాబుకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. గతంలో మోహన్ బాబు నటించిన ఎన్నో సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ పాటలు కూడా ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లుకు వీరి కాంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు పెరిగాయి.

ఇకపోతే.. మోహన్ బాబు సారథ్యంలో నడుస్తోన్న శ్రీవిద్యానికేతన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిన సంగతి తెలిసిందే. శ్రీ విద్యానికేతన్ కాలేజీకి యూనివర్సిటీ హోదా దక్కింది. ఈ విషయాన్ని కొద్దిరోజుల కిందట స్వయంగా పెదరాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు.