అయోధ్య తీర్పుపై మోహన్ భగవత్ వ్యాఖ్యలివీ...
- IndiaGlitz, [Saturday,November 09 2019]
దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఇవాళ తుదితీర్పులో సుప్రీం తేల్చేసింది. ఈ తీర్పుపై తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. అయోధ్యపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
అది నిజం కాదు..!
‘రామమందిరం నిర్మాణానికి అందరం చేయిచేయి కలిపి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్‌కు భూమి అప్పగించడం, ఆలయ నిర్మాణం అన్నీ జరుగుతాయి. ఇలాగే జరగాలని మేము నిర్దేశించడం లేదు. వివాదం సమసిపోయిందని భావిస్తున్నాం. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఎక్కడ ఇవ్వాలి, ఎలా అనేది సుప్రీం ఆదేశాల ప్రకారం కేంద్రం చూసుకుంటుంది. మందిరం నిర్మాణమే మా లక్ష్యం. సంఘ్ ఎప్పుడూ ఆందోళనలు చేస్తుందని ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నించారు...అది నిజం కాదు’ అని మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు.