వైసీపీలోకి మోహన్ బాబు.. జగన్ గెలుపు తథ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం లోటస్‌పాండ్‌కు వెళ్లిన మోహన్ బాబు, మంచు విష్ణు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు.. ఇటీవల జరిగిన ఫీజు రియింబర్స్ మెంట్ వివాదంపై సుమారు అరగంటకు పైగా జగన్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ.. జగన్‌ను ఆకాశానికెత్తేశారు. ఏపీలో వైసీపీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. అంతటితో ఆగని ఆయన సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను కానీ చావాలని కోరుకోనన్నారు.
బంధువు అని పార్టీలో చేరలేదు
"ఎలాంటి పదవి.. ఏదీ ఆశించకుండా వైసీపీలో చేరాను. జగన్‌మోహన్‌రెడ్డి వల్ల తెలుగు ప్రజలకు మంచి జరుగుతుంది. వైఎస్ జగన్ గెలుపు కోసం హృదయపూర్వకంగా సపోర్టు చేస్తాను. ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరానని.. పదవి కోసం అయితే మూడు సంవత్సరాల క్రితమే చేరేవాడిని. బంధువు అని పార్టీలో చేరలేదు.. తెలుగు ప్రజలకు మంచి చేయబోతున్నాడని పార్టీలో చేరాను. ఎమ్మెల్యేనో, ఎంపీనో అవ్వాలనుకుంటే మూడేళ్ల క్రితమే వైసీపీలో చేరేవాడిని. ఎన్టీఆర్ మరణం తర్వాత నేను ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీకి మాత్రం ఓ సందర్భంలో మద్దతు ఇచ్చాను. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తాను" అని మోహన్ బాబు స్పష్టం చేశారు.
చంద్రబాబు మోసం చేశారు..
"మూడు విడతలుగా ఫీజురియంబర్స్‌మెంట్ చెల్లిస్తానని చంద్రబాబు మోసం చేశారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రియంబర్స్‌మెంట్ ఆలస్యం అవుతుంది. ఫోన్ కాల్స్ ద్వారానే కాకుండా లెటర్స్ కూడా రాశాను. ఉత్తరాలు రాసినా సమాధానాలు లేవు. ఇప్పటికీ మీరు చెల్లించాల్సింది రూ. 19 కోట్ల చిల్లర ఉందని ఉత్తరం రాశాను. దాంట్లో 2017–18 విద్యా సంవత్సరానికి రూ. 2 కోట్ల చిల్లర రావాలని కోరాము. దీనికి ఇప్పటి వరకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎవరిపైనా దాడులు చేయలేదు.. చేయదు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout