విద్యార్థుల ఆత్మహత్యల పై మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్!
- IndiaGlitz, [Friday,April 26 2019]
తెలంగాణ ఇంటర్ ఫలితాల అనంతరం అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలతో చలించిపోయిన టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేవుడు జీవితాన్ని ఇచ్చింది చివరి శ్వాస వరకు జీవించడానికే తప్ప, అర్ధంతరంగా ముగించడానికి కాదని స్పష్టం ఆయన చేశారు.
దయచేసి తొందరపాటు నిర్ణయాలొద్దు..
భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది చివరి శ్వాస వరకు జీవించడానికి. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరిక్షల్లో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధవులు ఎందరో తల్లిడిల్లిపోతారు. ఇది అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేలమంది విద్యార్థినీ విద్యార్థులను అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనో నిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు, తెలంగాణ రాష్ట్రంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం మనసును కలిచివేసింది.
ప్రభుత్వం స్పందించింది.. తప్పుచేసిన వారిని శిక్షిస్తుంది. ఈ లోగా దయచేసి పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రులు హృదయాలను శిక్షించకండి. వారు కోరుకునేది మీ ఉన్నతిని. వారికోసం.. వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్లముందు ఎదిగిచూపిస్తామని నిర్ణయం తీసుకోండి అని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు అభిమానులు ఈ ట్వీట్‌ను షేర్ చేసుకుంటున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం మనసు కలిచివేసింది... pic.twitter.com/ZUCZ8vv3XN
— Mohan Babu M (@themohanbabu) April 26, 2019