40 వసంతాలను పూర్తి చేసుకుంటున్న మోహన్ బాబు
- IndiaGlitz, [Tuesday,November 17 2015]
తెలుగు సినిమా చరిత్రలో నటుడిగా నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుంటున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సినిమా చరిత్రలో కలెక్షన్ కింగ్ తెలుగు సినిమా చరిత్రలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఒక అధ్యాయం. నాలుగు దశాబ్దాల నట జీవితంలో మోహన్‌బాబు చేయని పాత్ర లేదు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన భక్తవత్సలం నాయుడు సినిమాలపై ఆసక్తితో చెన్నై నగరాన్ని చేరుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో1975, నవంబర్ 22న విడుదలైన స్వర్గం-నరకం సినిమాతో నటుడుగా తెలుగు తెరకు మోహన్‌బాబుగా పరిచయం అయ్యారు. తనదైన విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని వెండితెర పేరునే అసలు పేరుగా మార్చుకునేంత స్థాయిని చేరుకున్నారు. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు వన్నె తెచ్చిన గొప్ప నటుడు. ముఖ్యంగా డైలాగ్స్‌ను సన్నివేశానికి తగిన విధంగా నొక్కి వక్కాణించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం టాలీవుడ్‌లో డైలాగ్స్ ఏ స్టయిల్‌లో చెబితే ప్రేక్షకులకు రీచ్ అవుతుందో ఆ స్టయిల్లో చెప్పగల దిట్ట.
పాత్రేదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రను రక్తి కట్టించగట బహుకొద్దిమంది నటుల్లో కలెక్షన్‌కింగ్ ఒకరు. అందుకే ఆయన ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 520 చిత్రాలకు పైగా నటించి మెప్పించారు. ప్రతినాయకుడిగా విలక్షణ విలనిజాన్ని పండించిన మోహన్‌బాబు అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీ గారి పెళ్ళాం, పెదరాయుడు, మేజ్ చంద్రకాంత్..ఇలా 181 చిత్రాల్లో నాయకుడిగా నవరసాలు పండించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను కొ్ల్లగొట్టడంతో ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్ అయ్యారు. అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి 50కి పైగా విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. సినిమా రంగానికి విశిష్టసేవలను అందించిన మోహన్‌బాబు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను స్థాపించి పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. కళలు, విద్యారంగానికి మోహన్‌బాబు చేసిన విశిష్టసేవలకుగానూ కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ను సత్కరించింది. ప్రస్తుతం ఆయన ఇద్దరు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, తనయ మంచు లక్ష్మి కూడా సినిమా రంగంలోనే రాణిస్తున్నారు.
తన విలక్షణ నటనతో 520కు పైగా చిత్రాల్లో నటించి తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నవంబర్ 22, 2015కు నటుడుగా 40 వసంతాలను పూర్తి చేసుకుంటున్నారు. ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి నవంబర్ 22న కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తారు.