మోదీ ఏపీ పర్యటన ఖరారు.. టీడీపీ-బీజేపీ-జనసేన భారీ బహిరంగసభకు హాజరు..
- IndiaGlitz, [Tuesday,March 12 2024]
ఏపీలో ఎన్నికల రాజకీయం రంజుగా మారబోతుంది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ప్రచారం హోరెత్తించనున్నారు. మూడు పార్టీలు సంయుక్తంగా ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం మోగించనున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరుకున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
2014 ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు తిరుపతిలో జరిగిన సభలో ముగ్గురు నేతలు హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీలతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీకి టీడీపీ యువనేత నారా లోకేష్ నేతృత్వం వహించనున్నారు. ఈ సభ నుంచి ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు కీలక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సభ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సభ కోసం ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని టీడీపీ నేతలు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన అధికారులు సభకు ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలిరానున్నట్లు ఆ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై స్పష్టతకు వచ్చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల నుంచి బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మొత్తానికి 2014 ఎన్నికల సీన్ రిపీట్ చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు.