కొండపల్లి బొమ్మల గురించి ‘మనసులో మాట’లో చెప్పిన మోదీ
- IndiaGlitz, [Sunday,August 30 2020]
కొండపల్లి బొమ్మల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఆదివారం మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పండగలను క్రమశిక్షణతో జాగ్రత్తలతో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనా వేళ కూడా మన రైతులు కష్టపడి సాగు చేస్తున్నారని కొనియాడారు. వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్నదాతను గౌరవించే సంస్కృతి మనదని మోదీ పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించే కాకుండా.. ఏటికొప్పాక కళాకారుడు సీవీ రాజు గొప్పదనం సహా కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మల గురించి మోదీ తన ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించడం విశేషం. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ, ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని డుబ్రి, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశిల్లో తయారయ్యే బొమ్మలు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నాయన్నారు. పిల్లల్లో దాగున్న సృజనాత్మకను వెలికితీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని మోదీ పేర్కొన్నారు.
దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమల్లో స్టార్టప్‌లను ప్రారంభించడానికి అనేక చర్యలను తీసుకుంటున్నామని మోదీ వెల్లడించారు. ప్రతి పండుగను పర్యావరణహితంగా చేసుకోవాలన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని వెల్లడించారు. బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలని మోదీ పేర్కొన్నారు. మన కళానైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని మోదీ పేర్కొన్నారు.