Modi: కేసీఆర్ అవినీతిపై విచారణ జరుగుతోంది.. వదిలే ప్రసక్తే లేదు: మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ తెలిపారు. నిర్మల్ జిల్లా తూప్రాన్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి అవసరమా..ఫాం హౌస్‌లో పడుకొనే ముఖ్యమంత్రి మనకు అవసరమా..సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ము సరిపోదంటూ.. జాతీయ రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో మరో పార్టీతో కలిసి లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని.. దానిపై విచారణ జరుగుతోందని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ట్రైలర్ మాత్రమే.. సినిమా చూస్తారు..
దుబ్బాక, హుజూరాబాద్‌లో ట్రైలర్ మాత్రమే చూశారని.. ఇకపై సినిమా చూస్తారని మోదీ స్పష్టంచేశారు. హుజురాబాద్ సింహం ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీకి దిగితే కేసీఆర్ ఓటమి భయంతో మరో చోట కూడా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని.. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేసి తీరుతామని హామీ ఇచ్చారు. మోదీ మాట ఇస్తే గ్యారంటీగా చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరగలేదని.. కేసీఆర్ కుటుంబం ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిందని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసారని విమర్శించారు. స్కీముల పేర్లు చెప్పి స్కాములకు పాల్పడిన వ్యక్తి కేసీఆర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. వారి వారసత్వ రాజకీయాల కారణంగా దేశంలో వ్యవస్థలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్‌కు తాను హామీ ఇస్తున్నానని.. బీజేపీకి మద్దతుగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments