సాధ్వీని క్షమించే ప్రసక్తే లేదు..: మోదీ

  • IndiaGlitz, [Friday,May 17 2019]

మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గంటల్లోనే.. ఈ వ్యాఖ్యలతో నష్టం జరిగిపోతుందని పసిగట్టిన బీజేపీ ఆమెతో క్షమాపణలు చెప్పించారు. మొన్న విలక్షణ నటుడు కమల్ హాసన్, నిన్న ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలతో దేశంలో తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ తరుణంలో బీజేపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఓ వైపు కాంగ్రెస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు.. మరోవైపు ప్రజాగ్రహంతో ఎట్టకేలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి నష్టనివారణ చర్యలు చేపట్టారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజ్ఞా వ్యాఖ్యల గురించి ప్రస్తావన తెచ్చారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. గాంధీని అవమానించిన ప్రజ్ఞా ఎప్పటికీ క్షమించబోనని చెప్పారు. పౌర సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదించదగినవి కావని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకసారి రెండు సార్లు కాదు... వందసార్లు ఆలోచించాల్సిన అవసరముందని ఎంతైనా ఉందని మోదీ ఈ ఇంటర్వ్యూ వేదికగా నేతలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. సాధ్వీ క్షమాపణలు కోరడం అనే విషయం పక్కనపెడితే.. ఆమెను ఎట్టిపరిస్థితులు క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చివరి విడత ఎన్నికలు ఉన్నాయ్ కాబట్టి బీజేపీ ఇలా మాట్లాడుతోంది కానీ.. లేకుంటే ఈ వ్యాఖ్యలు అసలు లెక్కలోకి తీసుకోదని పలువురు క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా.. స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది హిందువే.. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సేనని కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని ప్ర్రజ్ఞాసింగ్‌ను ఓ విలేఖరి నుంచి ప్రశ్న ఎదురవ్వగా.. గాడ్సే గొప్ప దేశ భక్తుడని.. అతన్ని ఉగ్రవాది అనేవాళ్లు పునరాలోచించుకోవాలని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో క్షమాపణలు చెప్పారు.