మోదీ నోట గురజాడ మాట.. ఖుషీ అవుతున్న తెలుగు ప్రజలు
- IndiaGlitz, [Sunday,January 17 2021]
మహాకవి గురజాడ అప్పారావు మాటలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. నేడు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... తెలుగు మహనీయుడి మాటలను స్మరించారు. ‘‘దేశ మంటే మట్టికాదోయ్..దేశ మంటే..మనుషులోయ్..సొంత లాభం మానుకో.. గట్టిమేలు తలవెట్టవోయ్..’’ అంటూ గురజాడ మాటలను గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ నోటి వెంట గురజాడ మాట రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ ఖుషీ అవుతున్నారు. ఆయన మాటలకు సంబంధించిన వీడియోను తెలుగు రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కాగా.. ఇంకా మోదీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం పగలూ రాత్రి శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒకటి కాదు.. రెండు వ్యాక్సిన్‌లు వచ్చాయని.. అదీ మేడ్ ఇన్ ఇండియా అని తెలిపారు.
దేశీయ వ్యాక్సిన్‌తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశామని మోదీ పేర్కొన్నారు. ఇవే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్‌లు కూడా వస్తాయన్నారు. డ్రైరన్స్, ట్రయల్ రన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డ్రైరన్, ట్రయల్ రన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలిపారు. ప్రపంచమంతా భారత్‌కు చెందిన వ్యాక్సిన్‌ను నమ్ముతోందని.. ప్రపంచంలో 30 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చేది ఇండియా, చైనా, అమెరికా మాత్రమేనని మోదీ వెల్లడించారు.