Super Star Krishna : దివికేగిని ధృవతార.. సూపర్‌స్టార్ కృష్ణకు మోడీ, కేసీఆర్, జగన్‌ల సంతాపం

దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ.. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ:

కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేశ్, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.

కేసీఆర్ :

విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వైఎస్ జగన్:

కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

చంద్రబాబు నాయుడు:

తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

చిరంజీవి :

“మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.

అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.

పవన్ కల్యాణ్:

చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణగారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో ఆయనకి చక్కటి అనుబంధం ఉంది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.

సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’

బాలకృష్ణ:

కృష్ణ మరణంపై టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్‌స్టార్, అపరదానకర్ణుడు అంటూ బాలయ్య కొనియాడారు. టాలీవుడ్ జేమ్స్‌బాండ్, విలక్షణ నటుడిగా పేరుతున్న కృష్ణగారి మరణం సినీరంగానికి తీరని లోటని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానంటూ బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.