మోదీ.. 'ఎక్స్‌పైరీ పీఎం' అందుకే స్పందించలేదు!

  • IndiaGlitz, [Monday,May 06 2019]

ఉత్తరాంధ్రను దాటిన 'ఫొనీ' తుఫాను ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో విశ్వరూపం చూపించింది!. ఈ తుఫాన్ దెబ్బకు ఇరు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లగా పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. అయితే తుఫాన్‌ గురించి వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవడానికి సోమవారం నాడు ప్రధాని మోదీ ఒడిషాకు వెళ్లి రివ్యూ చేసి కేంద్రం నుంచి తక్షణ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే విధంగా బెంగాల్‌లో పరిస్థితిని కూడా తెలుసుకునేందుకు మోదీ యత్నించారు. బెంగాల్ సీఎంవో ఆఫీస్‌కు మోదీ రెండుసార్లు కాల్ చేశారు. అయితే ఎలాంటి రియాక్షన్ లేదు.

రెండు సార్లు ఫోన్ చేసినప్పటికీ!

మమతకు రెండు సార్లు ఫోన్ చేశానని.. మొదటిసారి కాల్ చేస్తే... సీఎం మమత పర్యటనలో ఉన్నారని.. రెండోసారి ఫోన్ చేయగా.. తాము తిరిగి ఫోన్‌ చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చెప్పారు. దీంతో ఇక లాభం లేదని గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ‌కి కాల్ చేసిన మోదీ తుఫాన్ గురించి వివరాలు అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. ఆమెకు ఎంత అహంకారం అంటూ విమర్శలు చేశారు. మళ్లీ మళ్లీ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా దీదీ నిరాకరించిందన్నారు.

దీదీ రియాక్షన్..

ఈ వ్యవహారంపై దీదీ ఎట్టకేలకు స్పందించారు. మోదీ నుంచి ఫోన్ వచ్చినప్పుడు తాను కావాల్సిందే మాట్లాడలేదని మమతా చెప్పుకొచ్చారు. ఇందుకు కారణాలు కూడా దీదీ నిశితంగా వివరించారు. మోదీ కాలం చెల్లిపోయిన ప్రధాని అని... ఆయనతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. మోదీ పదవీకాలం ముగిసిపోయిందని... మళ్లీ ఆయన ప్రధాని కాలేరని దీదీ జోస్యం చెప్పారు. ప్రధాని తనకు ఫోన్ చేసిన సమయంలో తాను ఖరగ్ పూర్ లో ఉన్నానని... తుపాను పరిస్థితిపై సమీక్షించేందుకు వెళ్లానన్నారు.

మాకు అక్కర్లేదు..!

అంతటితో ఆగని దీదీ.. మోదీ ప్రభుత్వం ఇచ్చే తుఫాను సాయం మా రాష్ట్రానికి అక్కర్లేదని మమతా తేల్చిచెప్పారు. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు బెంగాల్‌కు మోదీ చేసిన సాయమేమీ లేదని విమర్శలు గుప్పించారు. మొత్తానికి చూస్తే.. ఒడిశా, బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తుఫాన్ మీద ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో..? ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే మరి.