కరోనా బాధిత కుటుంబాల విషయంలో మోదీ కీలక నిర్ణయం..
Send us your feedback to audioarticles@vaarta.com
కొవిడ్ కారణంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించాలని కేంద్రం నిర్ణయించింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. ఉద్యోగి కరోనా కారణంగా మృతి చెందితే వర్తింపజేసే కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) పింఛను పథకం ప్రయోజనాన్ని కొవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబాలకూ వర్తింపజేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. అలాగే మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆ వ్యక్తి రోజువారీ వేతనంలో సగటున 90 శాతానికి సమానమైన మొత్తాన్ని పింఛనుగా అందించనున్నారు.
ఇదీ చదవండి: ఈ ఏడాది కూడా చేపమందు ప్రసాదానికి బ్రేక్..
కాగా.. బాధిత కుటుంబం పింఛను పొందాలంటే.. బీమా కలిగిన వ్యక్తి మరణానికి కనీసం మూడు నెలల ముందు ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదై ఉండాలి. అలాగే బీమా కలిగిన వ్యక్తి ఏడాదిలో కనీసం 78 రోజుల పాటు పని చేసి వేతనం పొందినట్టుగా నమోదై ఉండాలి. 2020 మార్చి 24 నుంచి ప్రయోజనాన్ని వర్తింపజేయనున్నారు. 2022 మార్చి 24 వరకూ దీన్ని కొనసాగిస్తారు. అలాగే కొవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే గరిష్ట బీమా ప్రయోజనాన్ని 6 లక్షల రూపాయల నుంచి 7 లక్షలకు పెంచారు. క్యాజువల్ కార్మికులు చనిపోవడానికి ముందు ఒకే సంస్థలో 12 నెలల పాటు విధులు నిర్వహించి ఉండాలన్న నిబంధనను సరళీకరించారు.
అలాగే కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్ ఫర్ చిల్డ్రన్ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్ది బలమైన భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ నిధి నుంచి 18వ సంవత్సరం నుంచి అయిదేళ్లపాటు నెలవారీ భృతి మంజూరు చేస్తారు. ఉన్నత విద్యకు వచ్చిన సమయంలో పిల్లల వ్యక్తిగత అవసరాలకు ఈ భృతి ఉపయోగపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout