Sheikh Sabji:రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
Send us your feedback to audioarticles@vaarta.com
రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి కారులో వెళ్తున్నారు. అయితే అకివీడు వైపు వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. డ్రైవర్, గన్‌మెన్, పీఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా సాబ్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు. "పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరం. తన చివరి ఘడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు. వీరితో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన ఆకస్మిక మరణం పట్ల తమ సంతాపం తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments