MLC Notification: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల
- IndiaGlitz, [Thursday,May 02 2024]
తెలంగాణలో ఓవైపు పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే.. మరోవైపు వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. మే 9 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. ఇక ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉపఎన్నిక కోసం నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. దీంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నల్గొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
కాగా గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. కాగా 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వగా.. 2027 మార్చి వరకూ ఆయన పదవీకాలం ఉంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిచిన అభ్యర్థి మరో మూడు సంవత్సరాలు పాటు పదవిలో ఉండనున్నారు.
ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలో దిగారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారనే ప్రచారం జరగ్గా.. వెలిచాల రాజేందర్ రావును కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది.