MLC Kavitha: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్..
- IndiaGlitz, [Wednesday,January 17 2024]
సైబర్ నేరగాళ్లు తెలంగాణలోని రాజకీయ ప్రముఖులకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి హల్‌చల్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయగా.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్(ఎక్స్), ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయినట్లు కవిత వెల్లడించారు. తన ఖాతాల ద్వారా అనుమానాస్పద కంటెంట్, వీడియోలు పోస్ట్ అయితే.. తాను పోస్ట్ చేసినట్లుగా భావించవద్దని ప్రజలను ఆమె కోరారు.
మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు పలుమార్లు హ్యాక్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఇన్‌స్టాలో సంబంధం లేని వీడియోను సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిని వెంటనే తన వ్యక్తిగత సిబ్బంది గుర్తించడంతో తెలంగాణ డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
కాగా అంతకుముందు గవర్నర్ తమిళిసై ఎక్స్(ట్విట్టర్)అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. దీంతో కంపెనీ నుంచి నిబంధనలు ఉల్లఘించారంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన గవర్నర్.. తన అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడంతో పాస్ వర్డ్ తప్పని చూపించింది. అనంతరం తన అకౌంట్ పరిశీలించగా ఆమెకు సంబంధం లేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే రాజ్‌భవన్ సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రాజకీయ నేతలు, పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను దుండగులు హ్యాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ ఖాతా కూడా హ్యాక్ కు గురైంది. ఆయన ఖాతాను తమ కంట్రోల్‌లోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార వీడియోలు పోస్టు చేశారు. దీనిపై అభిమానులు అప్రమత్తం చేయడంతో మంత్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఖాతా హ్యాక్‌కు గురైందని.. అందులో పోస్టుకు స్పందించవద్దని సూచించారు.
అలాగే మాజీ మంత్రి కేటీఆర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అకౌంట్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఇలా వరుసగా రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడంతో సైబర్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హ్యాకింగ్ ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.