సజీవ దహనాల కేసు: బెంగాల్ అసెంబ్లీలో అరుపులు, కేకలు.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
- IndiaGlitz, [Monday,March 28 2022]
పశ్చిమ బెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న బీర్భూం సజీవద హనాల ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తీవ్రరూపం దాల్చి ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఇరుపక్షాల శాసనసభ్యులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు.
సోమవారం బీర్భూం ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టింది ప్రతిపక్ష బీజేపీ.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను తృణమూల్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. మా సభ్యులపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారు అని బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.
కాగా.. మార్చి 21న బీర్భూం జిల్లాలో బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్పుర్హాట్ పట్టణ శివారులోని బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్ హత్యతో ప్రత్యర్థుల ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్యకు ముందు వారిని తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.