Rajasthan CM:రాజస్థాన్‌ సీఎంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే.. బీజేపీ సంచలన నిర్ణయం..

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 9 రోజుల తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. సీనియర్ నేతలను, రాజకీయ ఉద్ధండులను కాదని అనూహ్యంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వినోద్‌ తావ్డే, సరోజ్‌ పాండే సమక్షంలో జైపూర్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్ లాల్ శర్మను బీజేపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజే.. భజన్ లాల్ పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు బలపరిచారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డిప్యూటీ సీఎంలుగా దియా సింగ్, డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వాలు ఎంపియకయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా వాసుదేవ్ దేవ్‌నానీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కాగా బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 56 సంవత్సరాలు ఉన్న భజన్ లాల్ తొలిసారిగా సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిని ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రకటించడం దేశ రాజకీయాల్లో సంచనలంగా మారింది.

ఇక మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు డియో సాయ్‌ పేర్లను ప్రకటించింది. మొత్తానికి ఫలితాలు వెల్లడైన పది రోజులకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ ఫైనల్ చేసింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ సామాజిక వర్గాల వారీగా సీఎం అభ్యర్థులను కమలం పెద్దలు ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడపడుతున్నారు.