టీడీపీకి ఎమ్మెల్యే వంశీ రాజీనామా.. రాజకీయాలకు గుడ్ బై..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయ్. వైసీపీ ఊహించని విధంగా సీట్లు దక్కించుకోవడం.. టీడీపీ అడ్రస్ లేకుండా పోవడంతో.. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు అటు బీజేపీ.. ఇటు వైసీపీ గూటికి వెళ్లిపోతున్నారు. ఇలా వరుసగా టీడీపీ ముఖ్యనేతలు, రాజ్యసభ సభ్యులు పార్టీని వీడుతుండటంతో అసలు పార్టీ పరిస్థితి ఏమవుతుందా..? అని ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే వరుస షాక్‌లు తగిలిన టీడీపీకి తాజాగా కలలో కూడా ఊహించని మరో ఎదురుదెబ్బ తగిలింది.
వంశీ కీలక నిర్ణయం!
కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో అష్టకష్టమ్మీద గెలిచిన వంశీ.. టీడీపీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఈ సందర్భంగా అసలు తానెందుకు రాజీనామా చేస్తున్నాను..? ఇబ్బంది పడ్డ అంశాలేవి..? అనే విషయాలను లేఖలో నిశితంగా రాసుకొచ్చారు.
రాజీనామాకు దారితీసిన కారణాలు!
‘నాకు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు
. ఇప్పటి వరకు పార్టీలో నాకు అప్పగించిన బాధ్యతలు అన్నీ నిర్వర్తించా ను. ఇదే సమయంలో ప్రజలకు సేవ చేసినందుకు ఎంతో సంతృప్తి ఇచ్చింది.
తాజా పరిస్థితుల్లో స్థానిక వైసీపీ నేతల వల్ల నా అనుచరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారిని ఇబ్బంది పెట్టేవారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నా వల్ల తరచూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకే నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాను. ఈ క్రమంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని లేఖలో వంశీ స్పష్టం చేశారు.
ఏం చేయబోతున్నారు!?
అయితే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న వల్లభనేని వంశీ నిర్ణయంపై ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినప్పటికీ మీరు మాత్రం రాజకీయాల్లో కొనసాగాల్సిందేనని అనుచరులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండి వంశీ ఏం చేయబోతున్నారు..? అనేదానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి రాజకీయాలతో పాటు వంశీకి బిజినెస్‌లు మంచిగానే నడుస్తున్నాయి. మరి అనుచరుల డిమాండ్, కోరిక మేరకు రాజకీయాలకు దూరం అనే మాటను వెనక్కి తీసుకుంటారా లేకుంటే మాటంటే మాటే అన్నట్లు ఇలానే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
యార్లగడ్డ ఆల్ హ్యాపీస్!
కాగా.. గత కొన్ని రోజులుగా గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారిన విషయం విదితమే. వల్లభనేని వైసీపీలో చేరతారన్న నేపథ్యంలో ఆయన్ను చేర్చుకునేందుకు తాము ఒప్పుకోమని వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో వంశీపై పోటీ చేసి ఓడి ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న యార్లగడ్డ వెంకట్రావ్ శ్రేయోభిలాషులతో భేటీ అయ్యి.. సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వంశీ రాజీనామా చేయడంతో ఆయనకు ఇబ్బందులు తప్పాయని దీన్ని బట్టి తెలుస్తోంది. వంశీ రాజీనామాతో యార్లగడ్డ, ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారట. మరి మున్ముంథు గన్నవరం రాజకీయాలు ఎంత వరకూ వెళ్తాయో వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments