టీడీపీలో చీలిక రాబోతోంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Thursday,February 06 2020]
తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీలిపోతుందని చంద్రబాబులో భయం పట్టుకుందని, ఆయనలో అసహనం పెరిగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గడికోట చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నారన్న ప్రచారాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
అలాగే చంద్రబాబును కూడా!
‘గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు బాధ్యత మరిచి ఇష్టం వచ్చినట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని దూషిస్తున్నారు. లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. కనికట్టుగా మాట్లాడుతున్నారు. పార్టీ కేడర్ అంతా కూడా చంద్రబాబు అధ్యాయం ముగిసిందని ఆయన్ను నమ్మే స్థితిలో లేరు. పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయన్న సంకేతాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్‌ను ఎలాగైతే దించానో..అలాగే నన్ను దించబోతున్నారని చంద్రబాబుకు అర్థమైంది. తన కొడుకు అసమర్ధుడు, ప్రజలకు దగ్గర కాలేకపోయామన్న నిస్సహాయ స్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయారు. మీడియాతోనే బతకాలని చూస్తున్నారు. చీలిక తప్పదన్న ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది. చంద్రబాబును మోయడం వల్ల మాకు వచ్చే లాభం లేదని పత్రికాధినేతలు కూడా అలసిపోయారు. ఇది పసిగట్టిన చంద్రబాబు రోజు పత్రికాధినేతలను పిలిచిపించుకొని ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. తన కుమారుడి ఎమ్మెల్సీ పదవి ఊడబోతుంది. ఎక్కడ పార్టీ నేతలు తిరగబడుతారోనని పసిగట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయాలను దిగజార్చారు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇంటిపోరు కూడా..!
‘లోకేష్ తిరుగబడుతాడని చంద్రబాబు మెంటల్‌గా సిద్ధమయ్యారు. ఇంటిపోరు కూడా మొదలైంది. పార్టీ క్యాడర్ నమ్మే స్థితిలో లేదు. ఎల్లో మీడియా కూడా ఎంతకాలం భరించాలనే భావంతో ఉండంతో చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. మా నాయకులు వైయస్ జగన్‌కు సవాలు విసిరే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. మా నాయకులు పాదయాత్ర చేస్తే కృష్ణా వారధి, గోదావరి వారధి ఊగింది. అలాంటి నాయకుడితో నీకు పోలికా?. జెడ్‌ప్లస్ క్యాటగిరి లేకుండా బయటకు రాని చంద్రబాబు మా నాయకుడికి సవాలు విసురుతారా?. చంద్రబాబుకు దమ్ముంటే పోలీసులతోనే తుళ్లూరుకు రావాలి.. మా నాయకుడు కాదు..నేనే వస్తా. మేం తీసుకున్న విధానాలు ప్రజలకు చెబుతాం..మీరు ప్రలోభాలు పెట్టింది. ఏ రకంగా రైతులను మభ్యపెట్టింది క్లియర్‌గా చెబుతాం. ఆ ధైర్యం మీకుందా బాబూ?. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. రైతుల సమస్యలపై ప్రస్తావించాలి. మూడు గ్రామాల్లో మీ బినామీలు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వికేంద్రీకరణ ఎందుకు జరగాలో మేం స్పష్టంగా చెబుతాం. వికేంద్రీకరణ వద్దని చెప్పే ధైర్యం నీకుందా బాబూ.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని విశాఖలో నక్సలైట్లు ఉన్నారని వార్తలు రాయించావు. ప్రాజెక్టులు పోతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. కీయ పరిశ్రమ పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. కియా పరిశ్రమ యాజమాన్యమే మేం ఎక్కడికి వెళ్లడం లేదని చెబుతున్నా కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.