ఆన్‌లైన్ సినిమా టికెట్లు , ధరలు తగ్గించింది అందుకే: ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు
- IndiaGlitz, [Wednesday,December 29 2021]
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల మూసివేత, సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు వచ్చినా.. విషయం కోర్టు వరకు వెళ్లినా సీఎం వైఎస్ జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు సినీ పరిశ్రమ సైతం వివాదాన్ని పరిష్కరించేందుకు పలువురు ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేయగా... ఏపీ ప్రభుత్వం సైతం కమిటీని నియమించింది.
మంత్రి పేర్నినానితో టాలీవుడ్ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ కీలక సమావేశంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 19 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. టిక్కెట్ల ఖరారు అంశంపై కమిటీని నియమించామని ధియేటర్ల వర్గీకరణ, ధరలు ఆ కమిటీ నిర్ణయిస్తుందని పేర్ని నాని సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. సమస్య పరిష్కారం కోసమే కమిటీ వేశామని... వారు ఇచ్చే నివేదికను క్షణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నాని చెప్పారు.
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే , సినీ నటి రోజా సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. మధ్య, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా సినిమాలకు వస్తారని వారికి భారంగా ఉండకుండా ఫిక్స్‌డ్ రేట్లు ఉండేలా ప్రభుత్వం చేసిందని స్పష్టం చేశారు. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు ప్రభుత్వ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బంది లేదని రోజా అన్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద నిర్మాతలకు ఇబ్బంది ఉండడంతో వారు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఆమె తెలిపారు. సినీ ప్రముఖులు ప్రభుత్వంతో జరిపే చర్చలు సఫలం అవుతాయని ఆకాంక్షిస్తున్నానని రోజా అన్నారు. గతంలో నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు కోరినందువల్లే ప్రభుత్వం తరపున ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తెచ్చామని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ రోజా మండిపడ్డారు.