MLA Review
కమర్షియల్ సినిమాలకు ఉన్న ఆదరణ వేరు. దర్శకులు, హీరోలు కమర్షియల్ సెక్టార్‌లో పేరు తెచ్చుకోవాలని అశిస్తుంటారు. ఈ కోవలో హీరో కల్యాణ్ రామ్ చేసిన సినిమా ఎం.ఎల్.ఎ. కూడా కమర్షియల్ సినిమా కావడం.. నందమూరి కుటుంబానికి చెందిన హీరో.. పొలిటికల్ టైటిల్ పెట్టి సినిమా చేయడం వంటి విషయాల కారణంగా సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు చేసిన సినిమా కావడం.. ఇలా పలు విషయాల కారణంగా సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి ప్రేక్షకుల్ని ఎం.ఎల్.ఎ ఎలా మెప్పిస్తాడనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
కల్యాణ్ తన పేరు ఎం.ఎల్.ఎ అని చెప్పుకుంటూ ఉంటాడు. ( ఎం.ఎల్.ఎ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ మంచి లక్షణాలున్న అబ్బాయి తన చెల్లెలు (లాస్య)కి నచ్చినవాడు (వెన్నెల కిషోర్)తో పెళ్లి చేయిస్తాడు. దాంతో తండ్రికి కోపం రావడంతో చెల్లెలు, బావతో కలిసి ఇంటి నుండి బయటకొచ్చేస్తాడు. తన బావ సహాయంతో ఆయన కంపెనీలోనే ఓ ఉద్యోగం సంపాదించుకుంటాడు. అదే సమయంలో ఇందు(కాజల్)ను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె తన కంపెనీ ఎం.డి అని తెలుస్తుంది. అయినా కూడా తన ప్రేమను వదులుకోడు. ఇందుకి, కంపెనీకి ఓ కష్టం వస్తే తన తెలివి తేటలతో ఆ సమస్య నుండి బయట పడేస్తాడు. ఆ సమయంలో ఇందు తన ఎం.డి కూతురు కాదని తెలుస్తుంది. అసలు ఇందు ఎవరు? ఇందుకి, వీరభద్రపురంతో ఉన్న రిలేషన్ ఏంటి? నాగప్ప, గాడప్ప మధ్య గొడవేంటి? ఇందును పెళ్లి చేసుకోవాలనుకున్న కల్యాణ్‌కి ఆమె తండ్రి పెట్టే కండీషన్ ఎలాంటిది? చివరకు కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మూడు కీలక పాత్రలు చుట్టూ కథ తిరుగుతుంది. అందులో ఒకరు కల్యాణ్ రామ్. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. డాన్సులు, ఫైట్స్‌తో మెప్పించడమే కాదు.. లుక్ పరంగా చూడటానికి బావున్నాడు. బరువు తగ్గడం.. కాస్టూమ్య్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవడంతో లుక్‌లో డ్రాస్టిక్ చేంజ్ కనపడుతుంది. ఇక కాజల్ పాత్ర విషయానికి వస్తే.. కమర్షియల్ సినిమాల్లో నటించడం వల్ల ఇందు పాత్రలో కాజల్‌కు నటించడం పెద్దగా కష్టమనిపించలేదు. సునాయాసంగా చేసేసింది. ఇక విలన్‌గా నటించిన రవికిషన్.. విలనిజం పరంగా ఆకట్టుకున్నాడు. తనదైన మేనరిజమ్స్‌తో మెప్పించాడు. ఇక మణిశర్మ అందించి ట్యూన్స్ బావున్నాయి. అలాగే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్ రిచ్‌గా కనపడుతుంది.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఉపేంద్ర మాధవ్ సినిమాను చక్కగా డీల్ చేశాడు. అయితే కథ, కథనాల పరంగా కొత్తదనం కనపడలేదు. ఇంతకు ముందు పలు చిత్రాల్లో చూసిన కథతోనే ఉపేంద్ర కథను సిద్ధం చేసుకోవడం.. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగా లేదు. చాలా సన్నివేశాలు లాజికల్‌గా అనిపించదు. పోసాని కృష్ణమురళి, కరాటే కల్యాణి కామెడీ ట్రాక్ మినహా మరేదీ ఆకట్టుకోలేదు. బ్రహ్మానందం, అజయ్, పృథ్వీ, వెన్నెలకిషోర్ ఇలా పలువురు కమెడియన్స్ ఉన్నా కూడా సినిమాలో కామెడీ నవ్విచేంత లేదు.
సమీక్ష:
కమర్షియల్ సినిమా అంటే ఏంటి? ఎప్పుడో శ్రీనువైట్ల చేసిన కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూ అదే కథలను అటు ఇటు తిప్పి సినిమా తీయడమా? లేక కొత్త పాయింట్‌ను ఎంచుకుని వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించడమా? అని ఆలోచిస్తే.. రెండోదే కరెక్ట్. కానీ మన దర్శకులు ఆ విషయాన్ని మరచిపోతున్నారనిపిస్తుంది. పాత కథలనే అటు ఇటు తిప్పి తీస్తున్నారంతే. ఇది ప్రేక్షకుడికి కొత్తదనాన్ని ఇవ్వదు కదా! అసహనానికి గురి చేస్తుంది. హీరో క్యారెక్టర్ గురించి చెబుతూ మా అబ్బాయికి అన్ని మంచి లక్షణాలే అంటూ ఏదో ఇంపోజిషన్ రాయించినట్టు అన్ని సార్లు ఎందుకు చెప్పించారో అర్థం కాలేదు. ఇక హీరోయిన్ కాజల్ పాత్రకు ప్రథమార్థంలో కాస్తో కూస్తో ప్రాముఖ్యత ఉంది.. తీరా సెకండాఫ్‌కు వచ్చేసరికి కేవలం పాటలకే పరిమితమైపోయింది. విలన్ మంచి నటుడే కానీ కాస్త విలనిజం డోస్ పెంచుంటే బావుండేదనిపించింది. అప్పటి వరకు ఎవరూ చెప్పినా వినని జనం హీరో చెప్పగానే తమ మంచి చెడ్డలు గురించి ఆలోచించడం.. మందు పోస్తున్నారని తెలియగానే లైన్‌గా నిలబడి గొడవ పడటం.. సుత్తితో కొడితే సుమో టైర్లు ఊడిపోవడం.. ఇలా సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. లాజిక్ లేకుండా పలు సన్నివేశాలున్నాయి.
బోటమ్ లైన్: ఎం.ఎల్.ఎ.. రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
MLA Movie Review in English
- Read in English