ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Thursday,August 13 2020]

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరించింది. ఇటీవల రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి అచ్చెన్నాయుడు జలుబు తదితర కరోనా లక్షణాలతో బాధ పడుతుంటడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం అచ్చెన్నాయుడికి రమేష్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. కాగా.. ప్రతి వారం అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హైకోర్టుకు బులిటెన్ ఇస్తున్నారు. తాజాగా ఆయనకు పాజిటివ్ రావడంతో హైకోర్టుకు లేఖ రాయాలని వైద్యులు నిర్ణయించారు. అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తమకు తెలియజేయాలని కోరుతున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12న ఆయనను స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. టెలీహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్‌లు ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. అలాగే నామినేషన్ల పద్ధతిలో టెండర్లును కేటాయించాలంటూ అచ్చెన్నాయుడు ఆదేశించినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు.