‘ఓట్లు అడుక్కోను.. ఎమ్మెల్యేగా పోటీ చేయను..’!

  • IndiaGlitz, [Friday,January 03 2020]

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపు మొదలుకుని ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంకు సంబంధించి రకరకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఈయన గెలుపుకు కర్త, కర్మ, క్రియ అన్నీ యువనేత, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే విషయం తెలిసిందే. అయితే ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సిద్దార్థరెడ్డిని లెక్కచేయట్లేదని అందుకే వీరిద్దరి మధ్య పొరపొచ్చలొచ్చాయని తెలిసింది. అంతేకాదు.. నియోజకవర్గంలో చాలా వరకు సిద్ధార్థరెడ్డి తన గుప్పెట్లోకి తీసుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆర్థర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఇంకోసారి అడుక్కోను..!
‘ఇంకోసారి ఓట్లు అడుక్కోను.. ఎమ్మెల్యేగా అస్సలు పోటీ చేయను. కార్యకర్తలు వచ్చినా.. రాకపోయినా వాళ్ల కాళ్లు పట్టుకోను. ఊరికి పని కావాలంటే కార్యకర్తలే నా దగ్గరికి రావాలి. నేను ప్రజలకు ఏదో చేయాలని ఎమ్మెల్యేను అయ్యాను. కానీ ఇంకేదో జరుగుతోంది.. ఇక చాలు’ అని ఆర్థర్ చెప్పుకొచ్చారు. కార్యక్రమాలకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే వస్తున్నారని కార్యకర్తలు ఆర్థర్‌ను ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి.. గెలిపిస్తే కనీసం తమకు చెప్పకుండా రావడం ఎంతవరకు సమంజసం అని కార్యకర్తలు ఎమ్మెల్యేకు సూటి ప్రశ్నలు సంధించారు. అయితే కార్యకర్తల తీరుపై ఆర్థర్ తీవ్ర ఆగ్రహం వ్యక్యం చేశారు. జూపాడు మండలం బన్నూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్ముల్యే ఆర్థర్ అతిథిగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయన మాటలతో వైసీపీలో చర్చనీయాంశమైంది. అసలు నందికొట్కూరు రాజకీయాల్లో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. వ్యవహారం ఇది కాస్త ముదిరితే ఆర్థర్ రాజీనామాకు కూడా దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంపై బైరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అనేది చర్చనీయాంశంగా మారింది.