Mister Review
జీవితం చాలా చోట్లకు తీసుకెళుతుంది. కానీ ప్రేమ జీవితం ఉన్న చోటికే తీసుకెళుతుంది...అనే విషయాన్ని బాగా నమ్మిన ఓ కుర్రాడు ఏం చేశాడనేదే `మిస్టర్` సినిమా. మూడు చిత్రాలు మూడు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో చేసిన వరుణ్ తేజ్ ఈసారి కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలని దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా చేశాడు. గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించలేకపోవడంతో దర్శకుడు శ్రీనువైట్ల మిస్టర్ సినిమాను ఎలా రూపొందించాడు. మిస్టర్ ఏం చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో తెలుసుకుందాం...
కథ:
చై (వరుణ్‌తేజ్) స్పెయిన్‌లో వ్యాపారవేత్త ఎం.ఆర్.రావు (ఆనంద్) కుమారుడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తన తండ్రికి ఈశ్వరీరావుతో పెళ్లి జరిపిస్తాడు. ఆమెను మమ్మీ అని పిలుస్తాడు. ఒకసారి వాళ్లింటికి ఇండియా నుంచి ప్రియ వస్తుంది. ఆమెను తీసుకుని రావడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్తాడు. అక్కడ ప్రియకు బదులు మీరా (హెబ్బాపటేల్)ని కలిసి ఇంటికి తీసుకొస్తాడు. ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే మీరా అంతకు ముందే సిద్ధార్థ్ (ప్రిన్స్)ను ప్రేమించి ఉంటుంది. ఆ విషయాన్ని చైకి చెప్పి ఇండియాకి వెళ్తుంది. అక్కడ ఆమె ప్రేమకు సమస్య ఎదురైతే చైకి ఫోన్ చేసి ఏడుస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి గొడవను తీర్చడానికి ఇండియాకి వెళ్లిన చైకి అక్కడ చంద్రముఖి (లావణ్య) పరిచయమవుతుంది. తన గురించి ఏమీ అతనితో చెప్పదు చంద్రముఖి. అయినా ఆమెకు సాయం చేస్తాడు చై. ఓ సందర్భంలో గత్యంతరం లేక చంద్రముఖితో నిశ్చితార్థం జరుగుతుంది చైకి. ఇంతలో కొన్ని సంఘటనలు మీరాకు చైపై ప్రేమ కలిగేలా చేస్తాయి. అనుకోకుండా తన తాత పిచ్చయ్యనాయుడు (నాజర్) ఇంటికి వెళ్తాడు చై. అక్కడికి వెళ్లాక తాతపై తాను పెంచుకున్న ద్వేషం తప్పని అర్థం చేసుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? అసలు ఒడయార్ (నికితన్ ధీర్) ఎవరు? అతని తండ్రి ఎవరు? అతనికి చంద్రముఖికి సంబంధం ఏంటి? మధ్యలో గుండప్పనాయుడు చేసిన చెడు ఏంటి? రాయల ఆచారవ్యవహారాలను పాటించేవారు ఇప్పటికీ ఉన్నారా? వంటివన్నీ సినిమాలో వచ్చే ఇతరత్రా విషయాలు...
ప్లస్ పాయింట్స్:
- వరుణ్ తేజ్
- సినిమాటోగ్రఫీ
- ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్
- ఎడిటింగ్
- నేరేషన్
- కథ, దర్శకత్వం
సమీక్ష:
మొదటి మూడు సినిమాల్లో క్యారెక్టర్స్ పరంగా వేరియేషన్స్ చూపించిన వరుణ్ తేజ్ ఎన్నారై(స్పెయిన్ కుర్రాడుగా) చక్కగా నటించాడు. ఫైట్స్ డ్యాన్సుల్లో గత చిత్రాల కంటే ఇంకా బెటర్ పెర్‌ఫార్మర్ అయ్యాడు. డైలాగ్ డెలివరీలో ఈజ్ ఎక్కువగా కనపడింది. మంచి కమర్షియల్ హీరో లక్షణాలు కనపడుతున్నాయి. ఇక సినిమాను షూట్ చేసిన స్పెయిన్, ఊటీ, కేరళలోని లోకేషన్స్‌ను చక్కగా చూపించారు. హీరో, విలన్ మధ్య సాగే ఛేజింగ్ సీన్లు ఆకట్టుకుంటాయి. కుమారి 21ఎఫ్, ఈడోరకం-ఆడోరకం చిత్రాలతో యూత్‌కి బాగా కనెక్ట్ అయిన హెబ్బా ఇందులోనూ స్టైలిష్‌గా నటించింది. సెల్‌ఫోన్ అంటే ఏంటో తెలియనంత అమాయకురాలిగా లావణ్య నటించింది. లావణ్య ఇంతకు ముందు చేసిన చిత్రాల కంటే ఈ చిత్రంలో చేసిన పల్లెటూరి అమ్మాయి పాత్ర బావుంది. పిచ్చయ్యనాయుడుగా నటించిన నాజర్ సహా హీరో తల్లిదండ్రులుగా నటించిన ఆనంద్, ఈశ్వరీరావు, విలన్స్‌గా నటించిన నికితన్ ధీర్, హరీష్ రీశ్ ఉత్తమన్ తదితరులు తమకిచ్చిన పాత్రల్లో బాగానే చేశారు. విలన్ నికితన్ ధీర్ ముందు ఒక కొంతసేపు, మధ్యలో కొంత సేపు, చివరల్లో కొంతసేపు మాత్రమే కనపడతాడు. నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే దర్శకుడు శ్రీనువైట్ల కొత్త లోకేషన్స్‌లో సినిమాను చూపించే ప్రయత్నంలో భాగంగా ట్రావెల్ ఫిలిం చేశాడు. ప్రేమించిన ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కథా రచయిత ఆ విషయాన్ని ఆకట్టుకునే సన్నివేశాలతో చెప్పలేకపోయాడు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా లేదు. ఒక వైపు హరీశ్ ఉత్తమన్ గ్యాంగ్, మరో వైపు నికితన్ ధీర్ గ్యాంగ్, ఇంకో వైపు రాయల వంశం గ్యాంగ్ చేసే చేజింగులతో ఎవరు ఎవరి మనుషులోనని తేల్చుకోలేక అయోమయంగా అనిపిస్తుంది. కె.వి.గుహన్ కెమెరా పనితనం సినిమాకు హైలైట్. ప్రతి సీన్‌ను చాలా ఫ్రెష్ లుక్‌తో చూపించాడు. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. మిక్కి సంగీతం పెద్ద ఎఫెక్టివ్‌గా కనపడలేదు. ఏదో ఏదో బావుందే.. పాట బావుంది. అక్కడక్కడా మిక్కీ రీరికార్డింగ్ కూడా బావుంది. కామెడీని కష్టపడి పండించే ప్రయత్నం చేసినా పండలేదు. రఘుబాబు చేసిన ఊపిరి స్ఫూఫ్, పృథ్వి, శేషు, షకలక శంకర్ చేసిన కామెడీ సినిమాలో ఎక్కడా అతకవు. అతిగా అనిపిస్తుంటాయి. సినిమా లొకేషన్లను వెతకడంలో పెట్టిన శ్రమ కొద్దిగా సినిమా కథపై పెట్టి ఉంటే బావుండేదేమోననిపించింది. శ్రీధర్ సీపాన డైలాగులు అక్కడక్కడా బావున్నా.. చాలా చోట్ల కాపీ డైలాగుల్లాగా అనిపిస్తాయి. ముందు సన్నివేశాలను అనుకుని దాని ప్రకారం కథను రాసుకున్నట్లు అనిపించింది. సినిమాలో ప్రతి సీన్ మరో సినిమాలో ఎక్కడో చూశామనే భావనను కలిగిస్తుంది. సెకండాఫ్ చూశాక ఫస్టాఫ్ బావున్నట్లు అనిపించింది. సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఎందుకనే కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేశారు. బలమైన ఎమోషన్స్ లేవు.
బోటమ్‌లైన్: మిస్టర్... ఓ గజిబిజీ మాస్టర్
Mister English Version Review
- Read in English