Peddapally Bridge:పెద్దపల్లి జిల్లాలో తప్పిన ప్రమాదం.. మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన

  • IndiaGlitz, [Tuesday,April 23 2024]

పెద్దపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఆ సమయంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో 2016 ఆగస్టులో రూ.49 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కానీ మధ్యలో గుత్తేదారులు మారడం, నిధులు లేకపోవడం వంటి కారణాలతో వంతెన నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఎనిమిది సంతవ్సరాలు గడిచినా బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకూ 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సోమవారం అర్థరాత్రి సమయంలో ఈదురు గాలుల బీభత్సానికి వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. పగటివేళ వంతెన కూలిపోయి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదంటున్నారు.

కాగా కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. అంతేకాకుండా పిల్లర్లు, గట్టర్లు మధ్య బ్యాలెన్సింగ్ కోసం ఏర్పాటుచేసిన చెక్కముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్టర్లు ఓవైపు వంగిపోయాయి. దీంతో ఈదురు గాలుల ప్రభావంతో ఆ గట్టర్లు కింద పడిపోయినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్‌యంలో నాసిరకమైన పనులు జరుగుతుండటంతోనే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు కూలిపోయిన వంతెన శిథిలాలను తొలగిస్తున్నారు.