Talasani:నంది అవార్డులపై కాంట్రవర్సీ.. ఎవరు పడితే వాళ్లు చెబితే మేం ఎందుకిస్తాం : తలసాని సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
నంది అవార్డ్‌లపై ఇటీవల సినీ ప్రముఖులు పోసానీ కృష్ణమురళీ, అశ్వినీదత్‌ల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినీ పరిశ్రమ నుంచి నంది అవార్డులకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. పురస్కారాలు ఇవ్వాలని తమను ఎవరూ అడగలేదని.. అయినప్పటికీ ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డ్లు ఇవ్వరని తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అవన్నీ కమ్మనందులే అన్న పోసాని :
కాగా.. కొద్దిరోజుల క్రితం పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ నంది అవార్డ్స్‌ను టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రకటించిన నంది అవార్డ్స్‌ను ఇవ్వాలా..? వద్దా అనే సందిగ్థంలో వున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌తో చర్చించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని పోసాని తెలిపారు. అయితే అవార్డ్ కమిటీలో వుండే 12 మందిలో 11 మంది కమ్మవారే వుంటే అవి కమ్మ అవార్డులే అవుతాయన్నారు. తనకు కూడా టెంపర్ సినిమాకు నంది అవార్డ్ ప్రకటించారని .. కానీ అది కమ్మ నంది అని తనకు వద్దని పోసాని పేర్కొన్నారు. రచయితగా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, గాయం వంటి ఎన్నో మంచి సినిమాలకు పనిచేశానని.. కానీ వాటిలో ఏ ఒక్క దానికి తనకు నంది అవార్డ్ రాలేదని ఆయన వాపోయారు. ఇండస్ట్రీలో కులాలు, గ్రూపుల వారీగా నంది అవార్డులను పంచుకుంటున్నారని పోసాని ఆరోపించారు.
నంది అవార్డ్‌లపై ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు :
ఈ నేపథ్యంలో ఇటీవల మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వీనిదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితర పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు నంది అవార్డులకు ఎంతో ప్రాధాన్యత వుండేదన్నారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి లేకుండా పోయిందన్నారు. మరో నిర్మాత అశ్వినీదత్ మట్లాడుతూ.. ఎన్టీఆర్, కృష్ణలు సినిమా అంటే ఏంటో చూపించారని ప్రశంసించారు. పద్మాలయా సంస్థ ఎప్పుడో పాన్ ఇండియా సినిమా తీసేసిందన్నారు. ఫిలిం ఛాంబర్, పొడ్యూసర్ కౌన్సిల్ లాంటి సంస్థలను సమర్థవంతంగా నడిపారని అశ్వినీదత్ పేర్కొన్నారు. నంది అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ వాళ్లకు ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అవార్డ్లు ఇవ్వాలన్న పోసాని :
ఆ వెంటనే పోసాని స్పందించారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు.. మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు లాంటి అవార్డులు ఇవ్వాలి కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ వేదవలు, ఉత్తమ సన్యాసులు ఇలాంటి అవార్డులు మీ వాళ్లకే ఇవ్వాలని పోసాని కామెంట్ చేశారు. రజనీకాంత్‌ని రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగిడినా మాకేం అభ్యంతరం లేదని పోసాని అన్నారు. ఆయన చెన్నైలో సూపర్‌స్టార్ అని .. తెలుగు వాళ్లకు కాదని కృష్ణ మురళీ మండిపడ్డారు. మాకు సూపర్‌స్టార్ వున్నారని.. ఆయనే చిరంజీవి అని వ్యాఖ్యానించారు. చిరంజీవికి జగన్ అంటే ఎంతో ప్రేమ అని.. అలాగే చిరంజీ అంటే వైఎస్‌కి ఇచ్చినంత గౌరవాన్ని జగన్ ఇస్తారని పోసాని కృష్ణ మురళీ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout