పవన్‌పై గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్!?
- IndiaGlitz, [Thursday,June 06 2019]
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతిలో.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ చేతిలో పవన్ ఘోరంగా ఓటమి చెందారు. బహుశా పార్టీ అధినేత ఇలా ఎన్నికల్లో ఓటమిపాల్వడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమో కాబోలు. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు వారాలు పూర్తవుతున్నా అటు టీడీపీ నేతలు.. ఇటు జనసేన నేతలు ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.
సినిమాటోగ్రఫీ పక్కానా..!?
అయితే ఈ నేపథ్యంలో మరో షాకింగ్ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. భీమవరంలో పవన్‌పై కనివినీ ఎరుగని రీతిలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఫిక్స్ అయిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్‌పై గ్రంధి గెలవడంతో కచ్చితంగా ఆయనకు ‘సినిమాటోగ్రఫీ’ మంత్రి పదవి జగన్ ఫిక్స్ చేశారట. జూన్-08న జగన్ కేబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేయబోయే వారిలో కచ్చితంగా పేరుంటుందని ఆయన అనుచరులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడే షురూ చేశాడుగా!
కచ్చితంగా మంత్రి పదవి.. అది కూడా సినిమాటోగ్రఫీ వస్తుందని ధీమాగా ఉన్న గ్రంధి.. భీమవరంలో సంస్కరణలు షురూ చేశారు. మల్టీఫ్లెక్స్ దోపిడికి అడ్డుకట్ట వేసి.. థియేటర్ల పార్కింగ్‌లో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని థియేటర్ల యాజమాన్యాలను గ్రంధి హెచ్చరించారు. మల్టిఫ్లెక్సీల్లో అడ్డగోలు రేట్లు పెంచడం, పార్కింగ్ విషయంలో ఇష్టానుసారం రేట్లు పెంచినట్లు తన దృష్టికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. ఇలా ఆయన అప్పుడే పనులు షురూ చేయడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గ్రంధి ట్రాక్ రికార్డ్ ఇదీ..
2004 నుంచి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న గ్రంధీ శ్రీనివాస్.. ఇదే ఏడాది కాంగ్రెస్ తరఫున పోటీచేసి 7,905 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓటమి పాలవ్వడంతో శ్రీనివాస్‌పై బాగా సింపతీ పెరిగింది. ఇక 2019 ఎన్నికల్లో ఒకరు కాదు.. ఇద్దరు అటు టీడీపీ.. ఇటు జనసేన అభ్యర్థులను ఇద్దర్నీ గ్రంధి ఢీకొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేసినప్పటికీ సొంత సామాజిక వర్గం కూడా పట్టించుకోకుండా గ్రంధి శ్రీనివాస్‌కే గెలిపించుకున్నారు.
జగన్ కేబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో గ్రంధి శ్రీనివాస్ ఉంటారా..? లేకుంటే గాజువాక నుంచి పవన్‌పై గెలిచిన తిప్పల నాగిరెడ్డిని తీసుకుంటారా..? అనేది తెలియాలంటే మే-08 వరకు వేచి చూడాల్సిందే మరి.