Minister Peddi Reddy:ప్లాన్ మార్చి పుంగనూర్‌కి .. దాడి కోసమే, ఈ వయసులో ఇవేం పనులు, పిచ్చి పట్టిందా : చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు రౌడీమూకలను రెచ్చగొట్టి, కిరాయి గూండాలను 200 వాహనాల్లో తన వెంట తెచ్చుకున్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని.. ఆయన తీసుకొచ్చిన గూండాల వద్ద డబుల్ బేరర్ గన్స్ వున్నాయని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు కారణంగానే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని.. పోలీసులపైనా దాడులకు తెగబడి ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారని మంత్రి పేర్కొన్నారు.
వీధి రౌడీలా చంద్రబాబు పర్యటన :
చంద్రబాబు తన కుట్రల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని.. అందుకే వీధి రౌడీ లాగా మారి ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన ఘటనల కేసుల్లో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక పార్టీకి అధినేతగా వున్న చంద్రబాబు ఇలా చేస్తున్నారంటే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని అర్ధమవుతోందని రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల సమయంలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను చంద్రబాబు సృష్టించారని పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్లాన్ మార్చి పోలీసులు, వైసీపీ శ్రేణులపై దాడి :
చంద్రబాబు పుంగనూరు రావడం లేదని బైపాస్ మీదుగా వెళ్లిపోతారని టీడీపీ నేతలు మీడియాకు చెప్పారని.. కానీ శుక్రవారం కావాలనే ,ప్లాన్ ప్రకారం ఆలస్యంగా వచ్చి వీరంగం సృష్టించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎలా ఎదుర్కోవాలో చేతకాక.. వైసీపీ శ్రేణులపై , పోలీసులపై దాడులు చేయించారని రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. ఇకపై ఎన్నికల్లో గెలవలేమోనని దాడులు చేయించడం ఆయన నిరాశ, నైరాశ్యాన్ని తెలియజేస్తున్నాయని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మంచి వైద్యుడి దగ్గర చికిత్స తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన చురకలంటించారు.
నన్ను పుడింగి అంటాడా :
పుంగనూరు, అంగళ్లులో ఏనాడూ ఇలాంటి ఘటన జరగలేదని.. కిరాయి గూండాల్ని తెచ్చుకుని కార్లలో గన్‌లు పెట్టుకుని రావాల్సిన అవసరం ఏంటని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తనను పుంగనూరు పుడింగా, నీ తాత జాగీరా అని అన్న వ్యాఖ్యలను చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన తెలిపారు. చంద్రబాబు తనను తాను పెద్ద శాంతి కాముకుడని చెప్పుకుంటాడని, మరి ఈరోజు ఘటనల్ని చేయించిన వారిని ఏమనాలి అని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ వయసులో చంద్రబాబు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయిస్తాడని ఎవరూ అనుకోరని రామచంద్రారెడ్డి అన్నారు. అసలు ఇలాంటి హింసాత్మక చర్యలకు ఉసిగొల్పుతాడు అనుకుంటే ఆయనను రాష్ట్రంలో తిరగనిచ్చేవారు కాదని మంత్రి స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout