అధికారిక లాంఛనాలతో ముగిసిన గౌతంరెడ్డి అంత్యక్రియలు.. తరలివచ్చిన ప్రజానీకం
- IndiaGlitz, [Wednesday,February 23 2022]
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. గౌతంరెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
అంతకుముందు ఉదయం నెల్లూరులోని మంత్రి నివాసం నుంచి ఉదయగిరి వరకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి వరకు ఇది కొనసాగింది. మంత్రి గౌతమ్‌రెడ్డిని కడసారి చూసేందుకు దారి పొడవునా ప్రజలు తరలి వచ్చి అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సమయంలో గౌతమ్‌రెడ్డి తల్లి మణిమంజరి , సతీమణి శ్రీకీర్తి కన్నీటిపర్యంతమయ్యారు.
కాగా.. గత సోమవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో గుండెపోటుకు గురైన ఆయన కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో మేకపాటి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం 9.16 గంటలకు మరణించినట్లు అపోలో ఆసుపత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది.