అసెంబ్లీలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి
- IndiaGlitz, [Friday,March 26 2021]
ప్రతీచోట సరదాగా మాట్లాడుతూ నవ్వించే వారు ఉంటూనే ఉంటారు. సీరియస్‌గా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి చామకూర మల్లారెడ్డి నవ్వుల పువ్వులు పూయించారు. తమ పార్టీ నేతలనే కాకుండా.. ప్రతిపక్ష నేతలను సైతం తన మాటలతో కడుపుబ్బ నవ్వించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు విరగబడి నవ్వారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు.
మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన సంచలనంతో పాటు హాస్యాన్ని పడించడంలో ఆయనకు ఆయనే సాటి. అసెంబ్లీ, మీడియా ఎక్కడైన ఆయన మాటతీరే వేరు. నాడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కోరిన ఆయన.. నేడు కేసీఆర్‌ను ఏకంగా దేశ ప్రధానిని చేయాలన్నారు. అలా చేస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా కేసీఆర్ ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవన్నారు. దేశ చరిత్ర మారిపోతుందని తెలిపారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షంపై మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ చూపు తెలంగాణ వైపు ఉందని పేర్కొన్నారు. మనం ఎదుగుతుంటే ఓర్వలేకుంటా.. అంటూ తడబడి ఇదే నా సవాల్ అని చెప్పడంతో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం సభ్యులు, స్పీకర్ అంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఒక్కసారి.. ఒక్కసారి అంటూ సీఎం కేసీఆర్‌ను పీఎం కావాలని కోరారు. ఈ శాఖ పద్దు చాలా చిన్నదనిని చెబుతూనే... సభ్యులందరూ సహకరించి ఆమోదం తెలపాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.