KTR:చీమలపాడు ఘటనలో కుట్ర కోణం... మంత్రి కేటీఆర్ స్పందన ఇదే
- IndiaGlitz, [Thursday,April 13 2023]
ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో గాయపడిన వారిని గురువారం మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్‌లు పరామర్శించారు. ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు చేరుకున్న కేటీఆర్.. నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గాయపడ్డ వారి పరిస్ధితి నిలకడగానే వుందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని.. ప్రమాదంలో కుట్ర కోణం ఏమైనా వుంటే అది విచారణలో తేలుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరపు నుంచి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని మంత్రి వెల్లడించారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి:
కాగా.. బుధవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే సహా పలువురు అగ్రనేతలు రావడంతో వారికి స్వాగతం పలికేందుకు గాను బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. అయితే ఆ నిప్పురవ్వలు సభా ప్రాంగణానికి సమీపంలో వున్న గుడిసెలపై పడ్డాయి. మంటల ధాటికి లోపల వున్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురి పరిస్ధితి విషమంగా వుంది. పేలుడు ధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. కాళ్లు, చేతులు కోల్పోయి పలువురు శాశ్వత అంగవైకల్యం పొందారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.