KTR:సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
- IndiaGlitz, [Friday,November 24 2023]
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు వినూత్నంగా ఆలోచిస్తు్న్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతల్లో సామాన్యుడు బయటకు వస్తూ ఉంటాడు. దోసెలు వేయడం, ఇస్త్రీలు చేయడం, కూరగాయలు అమ్మడం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న మంత్రి కేటీఆర్.. ప్రచారంలో ఇలాగే సరికొత్త శైలిని అవలంభిస్తున్నారు.
మొన్న పాతబస్తీలో షాదాబ్ హోటల్‌కు కస్టమర్లను పలకరించి బిర్యానీ తిన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో సందడి చేశారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సాధారణ ప్రయాణికుడిలా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. తీవ్ర రద్దీ నడుమ ఐరన్ రాడ్డును పట్టుకుని నిలబడి ప్రయాణించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బేగంపేట మెట్రో వరకు ప్రయాణించిన ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. కేటీఆర్ కూడా అందరికి ఓపికతో సెల్ఫీలిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఇటీవల కేటీఆర్ ఫోన్ కాల్ లీక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ ఆడియో కాల్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సిరిసిల్లలో క్యాడర్ ప్రచారానికి వెళ్లాలంటేనే వెనకాడుతున్నారని.. కేటీఆర్ ఓడిపోవడం ఖాయం అంటోంది. అందుకే ఫోన్లు చేసి మరీ బతిమాలుకునే పరిస్థితికి కేటీఆర్‌కు వచ్చారని ఆ పోస్టులో పేర్కొంది. దీనిపై పరోక్షంగా స్పందించిన కేటీఆర్.. ప్రచారం చివరి రోజులలో అనేక తప్పుడు/డీప్ ఫేక్ వీడియోలు, కంటెంట్ ప్రచారం కావొచ్చని.. దయచేసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. తప్పుడు ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కోరారు.